నదిలోకి దూసుకెళ్లిన కారు.. వెంటనే

31 Oct, 2019 14:07 IST|Sakshi

భోపాల్‌ : వంతెనపై వెళ్తున్న ఓ కారు ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. నివారి జిల్లాలో ఓ చిన్నారితో సహ అయిదుగురు వ్యక్తులు  కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓర్చా ప్రాంతంలో నదిపై ఉన్న వంతెన మీదకు కారు రాగానే ఎదురుగా దూసుకొస్తున్న ఆటోను తప్పించబోయి..  కారు నదిలో పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కారులోని వ్యక్తులు హుటహుటిన కారు పైకి ఎక్కారు. అలాగే కారులో ఉన్న చిన్నారిని సైతం పైకి లాగి వంతెన మీద ఉన్నవారికి విసిరారు.

అయితే పాపను విసిరే క్రమంలో తను మళ్లీ నీటిలో పడిపోగా వంతెన మీద ఉన్న వారు వెంటనే నదిలోకి దిగి చిన్నారిని రక్షించారు. అనంతరం కారులో ఉన్న మిగిలిన నలుగురు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడగా  కారును ఢీకొట్టిన ఆటో మాత్రం అక్కడి నుంచి పరారైంది. ఈ దృశ్యాలన్నీ సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫూటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో దీన్ని వీక్షించిన నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ‘మానవత్వం ఇంకా బతికే ఉంది. సమయానికి స్పందించి పాపను కాపాడిన వారికి హ్యట్సాఫ్‌’ అంటూ.. పాపను రక్షించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  అయితే నదిపై వంతెన చిన్నగా ఉండటం, చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్లే కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు