‘అజాక్షి’ అరవడంతో.. అతని ప్రాణం నిలిచింది..!

31 Jul, 2019 16:22 IST|Sakshi
అపస్మారక స్థితిలో ప్రదీప్‌

శ్రీనగర్‌ : విశ్వాసానికి మారుపేరు కుక్క. ఈ విషయం మనందరికీ తెలుసు. యజమాని ప్రమాదంలో ఉన్నప్పుడు పసిగట్టి.. ప్రాణాలు కాపాడిన ఘటనలు చూశాం. ఇక పోలీస్‌ జాగిలమైతే మరింత అలర్ట్‌గా ఉంటుంది. కొండచరియలు మీదపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాణాలను ఓ జాగిలం నిలుపగలిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్‌ జాతీయ రహదారిలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రామ్‌బన్‌ జిల్లా లుధ్వాల్‌ గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్‌ మంగళవారం రాత్రి రోడ్డు పక్కన వెళ్తున్నాడు. ఉన్నట్టుండి ఓ భారీ కొండచరియ విరిగిపడింది. అతను ప్రమాదాన్ని గ్రహించి అక్కడ నుంచి పరుగెత్తాడు. అయినప్పటికీ మట్టిపెళ్లలు అతన్ని కప్పెట్టేశాయి. 

అయితే, రెగ్యులర్‌ చెకింగ్‌లో భాగంగా ప్రదీప్‌ కూరుకుపోయిన 147 నెంబర్‌ మైలురాయి వద్దకు సీఆర్పీఎఫ్‌ జవాన్లు బుధవారం తెల్లవారుజామున చేరుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడటం అక్కడ మామూలే కావడంతో.. తిరుగుపయనమయ్యారు. కానీ, అప్పుడే.. వారి జాగిలం ‘అజాక్షి’ మట్టికుప్పల కింద మనిషి ఆనవాళ్లు పసిగట్టింది. మొరుగుతూ... అక్కడే చక్కర్లు కొట్టడంతో జవాన్లు అలర్ట్‌ అయ్యారు. పై అధికారులకు సమాచారమిచ్చారు. మరింతమంది సిబ్బందిని రప్పించి.. జాగ్రత్తగా మట్టిని తొలగించడం మెదలుపెట్టారు.

తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ప్రదీప్‌ వారి కంటబడ్డాడు. అతన్ని బయటికి తీసి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతనింకా షాక్‌ నుంచి తేరుకోలేదని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. కొండచరియలు విరిగి పడుతుంటడంతో ఎన్‌హెచ్‌ 44 మూసివేశారు. ఇక ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవడంతో.. ఇటీవల నిర్మించిన కొత్త దారిలో కాకుండా.. సంప్రదాయ పురాతన మార్గం నుంచే భక్తులకు అనుమతిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు