ఆరోజు దుబే మనుషులు నన్ను కొట్టారు.. ఆ తర్వాత

16 Jul, 2020 16:35 IST|Sakshi

8 మంది పోలీసుల మరణం: అంతకు ముందు ఏం జరిగిందంటే..

లక్నో: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే తనను చంపేస్తాడనే భయంతోనే ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్‌ తివారీ వెల్లడించాడు. తన అత్తామామలకు చెందిన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోవద్దన్నందుకు అతడి మనుషులు తనపై దాడి చేశారని.. దీంతో తాను చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు. ఇంతకాలం ప్రాణ భయంతో రహస్య ప్రదేశంలో దాక్కొన్న తాను దుబే ఎన్‌కౌంటర్‌ విషయం తెలిసి బయటకు వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా తివారీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వికాస్‌ దుబేను అదుపులోకి తీసుకునేందుకు జూలై 2న పోలీసులు బిక్రూ గ్రామానికి వెళ్లగా.. అతడి గ్యాంగ్‌ వారిపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు నేలకొరిగారు. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం దుబే వారం రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. (వికాస్‌ దుబే నెల సంపాదనెంతో తెలుసా?)

ఈ నేపథ్యంలో జూలై 2 నాటి ఘటన(ఎనిమిది మంది పోలీసుల మరణం)కు ముందు చోటుచేసుకున్న పరిణామాల గురించి తివారీ బుధవారం ఓ జాతీయ మీడియాకు వెల్లడించాడు. ‘‘మా అత్తింటి వారి ఆస్తి విషయంలో జోక్యం వద్దన్నందుకు వికాస్‌ దుబేకు కోపం వచ్చింది. దీంతో జూన్‌ 27న నేను బైక్‌పై వెళ్తున్న సమయంలో దుబే మనుషులు నాపై దాడిచేసి, బైక్‌, నా దగ్గర ఉన్న డబ్బు లాక్కెళ్లారు. ఈ విషయం గురించి నేను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.  స్టేషన్‌ ఆఫీసర్‌ వినయ్‌ తివారీ ఈ కేసును దర్యాప్తు చేస్తానని చెప్పారు. జూలై 1న వినయ్‌ తివారీని.. నన్ను దుబే మనుషులు కొట్టిన చోటుకు తీసుకువెళ్లాను. వాళ్లు అక్కడే ఉన్నారు. పోలీసు అధికారి ముందే నన్ను మళ్లీ కొట్టి, ఆయనను బెదిరించారు. (ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైన దూబే?!)

దీంతో వినయ్‌ తివారీ చాలా భయపడ్డారు. దుబే మనుషులు తనను చంపేస్తారని భావించి.. తాను ధరించిన జంధ్యం చూపించి.. పండితులపై కరుణ చూపాలంటూ వేడుకున్నారు. ఇంతలో వికాస్‌ దుబే వచ్చి గంగా నది నీళ్లను మాకు ఇచ్చారు. అప్పుడు రాహుల్‌ తివారీని (అంటే నన్ను) చంపను అని తనకు మాట ఇవ్వాలని వినయ్‌ తివారీ దుబేను అడిగారు. ఆ తర్వాత మరుసటి రోజు నన్ను పిలిచి కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత దుబే నా బైక్‌ తిరిగి ఇచ్చేశాడు. కానీ నాకు మాత్రం భయం వేసింది. అతడు నన్ను చంపేస్తాడని అర్థమయింది. దీంతో నేను మరోసారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. దుబేపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు’’ అని తనకు ఎదురైన భయంకర అనుభవాల గురించి చెప్పుకొచ్చాడు. (వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

ఈ క్రమంలో జూలై 2 అర్ధరాత్రి కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో దుబే ఇంటికి వెళ్లగా అతడి మనుషులు ఎనిమిది మంది పోలీసులను బలితీసుకున్నారని పేర్కొన్నాడు. ఆ ఘటన తనను భయభ్రాంతులకు గురిచేసిందని.. అప్పటి నుంచి తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి అజ్జాతంలోకి వెళ్లినట్లు తెలిపాడు. ఇక దుబే ఎన్‌కౌంటర్‌ తర్వాత ‘కెప్టెన్‌’ను కలవగా.. తనకు సెక్యూరిటీగా గన్‌మ్యాన్‌ను ఇచ్చారని, దాంతో తన ఇంటికి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బడా నాయకులు, పోలీసులకు సంబంధించిన రహస్యాలు బయటపెడతాడనే కారణంతోనే అతడిని హతమార్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు