కంటతడి పెట్టిస్తున్న ఓ తండ్రి ఆవేదన!

16 May, 2020 16:41 IST|Sakshi

లక్నో: కరోనా కారణంగా  ప్రతి ఒక్కరు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉపాధి కోల్పొయి ఆహారం దొరకక వలసకార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలి నడక సొంత ఊర్లకు బయలుదేరి మధ్యలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు కోల్పొతున్న దయనీయ పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతకన్నా  దయనీయమైన పరిస్థితి ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది. సంవత్సరం వయసున్న కొడుకు చనిపోతే కరోనా కారణంగా ఆ బిడ్డను చివరి చూపు  చూడటానికి కూడా ఆ తండ్రి నోచుకోలేకపోయాడు. తన బిడ్డని కడసారయిన చూసుకోవాలని ఆశపడిన ఆ తండ్రికి నిరాశే మిగిలింది. ఆ తండ్రి తన బిడ్డని చూడలేక కంటతడి పెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

రామ్‌ పుకార్‌ పండిట్‌(38)  దశాబ్ధం నుంచి ఢిల్లీలో రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు మూడు నెలలకు ఒకసారి బీహార్‌లో ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్లి చూసి వస్తుంటాడు. కరోనా కారణంగా ఢిల్లీలోనే చిక్కుకుపోయిన అతనికి సోమవారం యేడాది వయసున్న తన కుమారుడు చనిపోయాడని తన భార్య దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. అంతే తన బిడ్డను కడసారయిన కళ్లారా చూసుకుందాం అని హుటా హుటిన బయలు దేరాడు. బస్సులు, రైళ్లు ఏవి అందుబాటులో లేకపోవడంతో నడుచుకుంటూనే తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ వద్ద పోలీసులు అతనిని అడ్డుకున్నారు. తన కొడుకును చూడటానికి వెళ్లనివ్వాలంటూ అతను పోలీసులను వేడుకున్నాడు. అయిన పోలీసులు అతనిని విడిచిపెట్టలేదు. ఘాజీపూర్‌ ప్లైఓవర్‌ దగ్గరే అతను మూడు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. తాను ఎంత చెప్పినా పోలీసులు తన మాట వినిపించుకోలేదని పండిట్‌ ఆరోపిస్తున్నారు. అయితే కొంత మంది ఎన్‌జీఓలు, పోలీసులు తనకి అహారం అందించారని తెలిపాడు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు')

గురువారం రోజు అతనిని కొంత మంది అధికారులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బీహార్‌ వెళ్లే ట్రైన్‌ ఎక్కించారు. అతడు తన గ్రామం బెగుసారై చేరుకోగానే అతనిని కోవిడ్‌-19 పరీక్షల కోసం తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ‘నేను నా కుటుంబాన్ని తొందరలోనే కలుసుకుంటా అనుకుంటున్నాను. నేను సరిహద్దు దగ్గర ఎదుర్కొన్న ఘర్షణ కంటే నేను లేకుండా నా కొడుకు అంత్యక్రియలు నా కుటుంబమే నిర్వహించడం నాకు బాధగా ఉంది. నేను ఇంకెప్పటకీ నా కొడుకును చూడలేను’ అని పండిట్‌ కన్నీటి పర్యంతమవుతుంటే అక్కడ ఉన్నవారందరి మనసులు బాధతో బరువెక్కిపోయాయి. తన కొడుకు స్టమక్‌ ఇన్ఫ్‌ఫెక్షన్‌తో చనిపోయినట్లు రామ్‌ పండిట్‌ తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 24 మంది మృతి)

ఈ విషయం పై ఘజియాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ దీనికి సంబంధించి వారికి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ఇక తూర్పు ఢిల్లీ మేజిస్టేట్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ... ‘మా బృందం ఇలాంటి వారిని వెతికి వారికి ఆహారాన్ని అందిస్తోంది. మాకు పండిట్‌ గురించి తెలియగానే మేం అతనిని ఢీల్లీలో బీహార్‌ వెళ్లే రైలు ఎక్కించాం’ అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పండిట్‌ పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్నారు. ('పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు')

మరిన్ని వార్తలు