10 రోజులు ఎయిర్ పోర్టులో నక్కాడు!

2 Jun, 2016 12:52 IST|Sakshi
10 రోజులు ఎయిర్ పోర్టులో నక్కాడు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో భద్రతా లోపాలు బయటపడుతున్నాయి. నకిలీ టిక్కెట్లతో ఎయిర్ పోర్టులోకి చొరబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డేకు వారం రోజుల ముందు జరిగిన ఘటన భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోంది. నకిలీ టికెట్ తో ఎయిర్ పోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి ఏకంగా 10 రోజుల పాటు అక్కడ తిష్ట వేశాడు. అతడిని హౌస్ కీపింగ్ ఉద్యోగి గుర్తించి సీఐఎస్ఎఫ్ కు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.

జనవరి 20న అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్లాగా గుర్తించారు. ఇండియా ఎయిర్‌ పోర్టులో ఒక వ్యక్తి ఇన్నిరోజులు తిష్ట వేయడం ఇదే మొదటిసారని సీఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. జనవరి 11న అబ్దుల్లా.. ఢిల్లీ విమాశ్రయానికి వచ్చాడు. అతడి టికెట్ నకిలీదని గుర్తించి అనుమతి నిరాకరించారు. అయితే అతడు మరో గేటు గుండా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. ఎవరికీ అనుమానం రాకుండా 10 రోజుల పాటు అక్కడ గడిపాడు. దుబాయ్ వెళ్లేందుకు రావల్సిన డబ్బు అందుకునేందుకే ఎయిర్ పోర్టులో వేచివున్నానని పోలీసుల విచారణలో అతడు చెప్పాడు.

ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో నకిలీ టికెట్లతో 2015లో 50 మందిపైగా పట్టుబడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. మార్చిలో ఓ యువకుడు భద్రతాదళాల కళ్లుగప్పి తుపాకీతో ఎయిర్ పోర్టులోపలికి ప్రవేశించాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని గత నెలలో అరెస్ట్ చేశారు. విమానాశ్రయాల్లో భద్రతా వైఫల్యాలపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు