గిన్నిస్ 'మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్'..!

3 May, 2016 16:31 IST|Sakshi
గిన్నిస్ 'మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్'..!

నాసిక్ః అతడో  వ్యాపారి, రాజకీయనాయకుడుగా పేరొందిన వ్యక్తి. అయితే అతడ్ని స్నేహితులు మాత్రం ద మ్యాన్ విత్ ద గోల్డెన్ షర్ట్ అని పిలుస్తున్నారు. ఆ సార్థక నామం వెనుక కథా కమామీషూ ఏమిటంటే...

మహరాష్ట్ర నాసిక్ కు చెందిన పంకజ్ పరాఖ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. 47 ఏళ్ళ పరాఖ్ 2014 ఆగస్టు 1న  98,35,099 రూపాయల అత్యంత ఖరీదైన బంగారు షర్టును ధరించి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాడు. నిజంగా తనకీ గౌరవం లభించడం నమ్మలేకపోతున్నానని, తనకు ఇటువంటి గుర్తింపు రావడంకన్నా.. తమ మారుమూల గ్రామం పేరు.. ప్రపంచవ్యాప్తమవ్వడం ఎంతో సంతోషంగా ఉందని పరాఖ్ చెప్తున్నాడు. పాఠశాల  డ్రాపవుట్ అయిన పరాఖ్... గార్మెట్ ఫ్యాబ్రికేషన్ వ్యాపారవేత్తగానూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే కాక, ముంబైకి 260 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ జిల్లా యెవోలా పట్టణానికి డిప్యూటీ మేయర్ కూడ. అయితే అన్ని ప్రత్యేకతలున్న పరాఖ్.. 4.10 కిలోలు.. అంటే ప్రస్తుతం 1.30 కోట్ల రూపాయల ఖరీదుచేసే షర్లుతోపాటు, బంగారు వాచ్, గొలుసులు, ఉంగరాలు, మొబైల్ కవర్, కళ్ళద్దాలకు బంగారు ఫ్రేమ్ వంటి ఇతర వస్తువులతో కలసి సుమారు 10 కేజీల బంగారు వస్తువులను ధరించి, ఓ లైసెన్స్డ్ రివాల్వర్ చేత పట్టుకొని, ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతోపాటు యెవోలా వీధుల్లో మిరుమిట్లు గొలుపుతూ కనిపించి,  అప్పట్లో అందర్నీ ప్రత్యేకంగా ఆకట్టుకోవడమే కాక.. ఏకంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపును కూడ పొందాడు.

రెండేళ్ళ క్రితం తన 45వ పుట్టిన రోజు సందర్భంలో... ప్రత్యేకంగా ఆ గోల్డెన్ షర్టును కుట్టించుకున్నానని, తనకు పాఠశాల వయసునుంచే బంగారం అంటే ఎంతో ఇష్టమని, అదే ఇష్టం ఏళ్ళు గడిచే కొద్దీ  పాషన్ గా మారిందని పరాఖ్ చెప్తున్నాడు. నాసిక్ కు 85 కిలోమీటర్ల దూరంలోని బాఫ్నా జ్యువెలర్స్ వారు డిజైన్ చేసిన ఆ షర్టుకు, ముంబైలోని శాంతి జ్యువెలర్స్ వారు ముత్యాల హంగులద్దారని పరాఖ్ తెలిపాడు. 18 నుంచి 22 క్యారెట్ల బంగారంతో ఆషర్టు రూపొందించేందుకు సుమారు 20 మంది కళాకారులు, 3,200 గంటలు వెచ్చించారని, షర్టు... లోపలి భాగంలో మెత్తని క్లాత్ వేసి కుట్టడంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా  ధరించేందుకు కూడ ఎంతో వీలుగా ఉంటుందని పరాఖ్ తెలిపాడు. అంతేకాక షర్టు ఉతికేందుకు, రిపేర్ చేసుకునేందుకు కూడ వీలుగా ఉండటంతోపాటు తనకు ఈ అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన  షర్టుకు లైఫ్ టైం గ్యారంటీ ఉందని ఫరాఖ్ వెల్లడించాడు.

30 సంవత్సరాల క్రితం పేదరికం అనుభవించిన పరాఖ్ ఎనిమిదో తరగతి తర్వాత స్కూలుకు స్వస్తి చెప్పి, యెవోలాలో తల్లిదండ్రులు కొనసాగిస్తున్న చిన్నపాటి గార్మెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. వ్యాపారాభివృద్ధిలో ఒక్కో అడుగు ముందుకేస్తూనే రాజకీయాల్లోనూ ప్రవేశించి, 1982 లో మొదటిసారి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యాడు. 25 ఏళ్ళక్రితం తన పెళ్ళిలో వధువు కన్నా ఎక్కువ బంగారం ధరించడంతో అందరూ తనను వింతగా చూశారని ఈ సందర్శంలో పరాఖ్ గుర్తు చేసుకున్నాడు. తన ఇష్టమే ఇప్పుడు  ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందని ఊహించలేదని, ఇప్పటికీ బంగారంపై అదే ఇష్టం ఉన్న తాను... పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వెళ్ళినపుడు సుమారు మూడున్నర కేజీల బరువుండే బంగారు ఆభరణాలను ధరించి వెడతానని, తన భార్య మాత్రం 50 గ్రాములకు మించి ఆభరణాలు ధరించదని చెప్తున్నాడు.

మానవత్వానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే పరాఖ్... సామాజిక సేవ, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటుంటాడు. మొత్తం ఖర్చును తానే వెచ్చించి,  గత ఏడేళ్ళలో రాజస్థాన్ ఉదయపూర్ లోని ప్రముఖ నారాయణ్ సేవా సంస్థాన్ ఆస్పత్రిలో  సుమారు 150 పోలియో ఆపరేషన్లను చేయించాడు. ప్రతి సంవత్సరం ఓ వారం పాటు తన సమయాన్ని వెచ్చించి, ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, పేద రోగులకు ఆర్థిక సహాయం, ఆహారం, మందులు అందించి.. పరాఖ్ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు