మేనకా గాంధీకి షోకాజ్‌ నోటీసులు!

13 Apr, 2019 09:22 IST|Sakshi

లక్నో : ముస్లింలు తనకు ఓటేయాలని, గెలిచిన తర్వాత తనతో వారికి పడుతుందంటూ బ్లాక్‌మెయిలింగ్‌ ధోరణిలో మాట్లాడిన కేంద్రమంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీకి షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌లోని తురబ్‌ ఖానీ గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా గెలుపు తథ్యం. కానీ ముస్లింల మద్దతు లేకుండా గెలవడం నాకు సంతోషాన్నివ్వదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడానికి తామేమీ మహాత్మా గాంధీ వారసులం కాదు కదా’ అంటూ మేనక వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా సుల్తాన్‌పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ కూడా ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

కాగా గతంలో ఫిలిబిత్‌ నుంచి పోటీ చేసిన మేనకా గాంధీ ఈసారి తన కుమారుడు వరుణ్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న సుల్తాన్‌పూర్‌ నుంచి బరిలో దిగుతున్నారు. అదే విధంగా వరుణ్‌ గాంధీ పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో మేనక మాట్లాడుతూ.. పిలిభిత్‌ నుంచి గతంలో తాను ఆరుసార్లు గెలుపొందానని, అక్కడి ప్రజలకు తానేంటో తెలుసనని పేర్కొన్నారు. ముస్లింలను ఉద్దేశించి.. ‘మీరు ఓటు వేసినా... వేయకపోయినా గెలుస్తాను. కానీ ఇది ఇచ్చిపుచ్చుకోవాల్సిన వ్యవహారమని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు