మేనకాగాంధీ వర్సెస్ జవదేకర్

10 Jun, 2016 02:38 IST|Sakshi
మేనకాగాంధీ వర్సెస్ జవదేకర్

జంతు వధపై కేంద్ర మంత్రుల మధ్య రచ్చ
* పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనక
* రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే చంపామన్న జవదేకర్

న్యూఢిల్లీ: జంతు వధ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. అరుదైన జంతువులను చంపే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. ఇటీవల బిహార్‌లో 200 అరుదైన బ్లూబుల్స్ (నీల్గాయ్)ను కాల్చి చంపిన నేపథ్యంలో ఈ అంశంపై జంతువుల హక్కుల ఉద్యమకర్త అయిన మేనక తీవ్రంగా స్పందించారు.

దీనిని అతిపెద్ద ఊచకోతగా అభివర్ణించిన ఆమె.. కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి జంతువులను చంపేందుకు ఒక జాబితా తయారు చేస్తే తాము అందుకు అనుమతిస్తామని కోరిందని ఆరోపించారు. జంతువులను చంపాలనే పర్యావరణ శాఖ ఆరాటం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆమె చెప్పారు. బిహార్‌లో నీల్గాయ్‌లు, పశ్చిమబెంగాల్‌లో ఏనుగులు, హిమాచల్ ప్రదేశ్‌లో కోతులు, గోవాలో నెమళ్లు, చంద్రపూర్‌లో అడవి పం దుల సంహారానికి కేంద్రం అనుమతిచ్చిం దని ఆరోపించారు.
 
అయితే పర్యావరణ శాఖ నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి జవదేకర్ సమర్థించుకున్నారు. పంటలు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే జంతు సంహారానికి అనుమతి ఇచ్చామని, దీనిని నిర్ధిష్ట ప్రాంతాలకు, నిర్ధిష్ట కాల వ్యవధికే పరిమితం చేశామని చెప్పారు.  రైతుల పొలాలు ధ్వంసమవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదన పంపితే అప్పుడే తాము అనుమతి ఇస్తామని చెప్పారు. మంత్రుల మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.మోదీ ప్రభుత్వంలో టీమ్ వర్క్ అనేదే లేదని ఎద్దేవా చేశాయి. వివిధ శాఖల మధ్య వివాదాలు ఇదే తొలిసారి కాదని, టీమ్ వర్క్ లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని జేడీయూ, ఎన్సీపీ విమర్శించాయి.

మరిన్ని వార్తలు