12 రోజులుగా ఖననం చెయ్యకుండా...

18 Aug, 2017 14:52 IST|Sakshi
12 రోజులుగా ఖననం చెయ్యకుండా...
ఇంఫాల్‌: ఎంత భేదాభిప్రాయాలున్నా, ఎన్ని అవాంతరాలున్నా మరణం మనుషులను దగ్గర చేస్తుందని అనుకుంటాం. కానీ, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో అలాంటి పరిస్థితులు మచ్చుకైనా కనిపించటం లేదు. ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ బాపిస్ట్, క్యాథలిక్ క్రైస్తవ వర్గాల మధ్య 20 ఏళ్లుగా జరుగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అక్కడ తారా స్థాయికి చేరుకుంది. 
 
ఈ నెల 7న ఉక్రుల్‌ జిల్లాలోని లిటన్‌ గ్రామంలో రీటా హవోరేయి అనే 42 ఏళ్ల మహిళ చనిపోగా.. 12 రోజులుగా ఆమె అంతిమ సంస్కారాలు జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. అందుకు కారణం ఆమె బాపిస్ట్ నుంచి క్యాథలిక్‌ వర్గానికి మారిపోవడమే. ఇదే కారణంతో ఆమె కుటుంబాన్ని ఏడేళ్ల క్రితం వెలివేశారు కూడా. దీంతో ఓ క్యాథలిక్‌ చర్చలో ఆమె మృతదేహాన్ని ఉంచారు.
 
బాపిస్ట్(టంగ్‌కుల్) ఆధిపత్యం ఎక్కువగా ఉన్న లెయిన్‌ గాంగ్‌చింగ్‌ లో రీటా శవాన్ని ఖననం చెయ్యనీయకుండా ఆ వర్గ పెద్దలు అడ్డుకుంటున్నారు. దీంతో ఆమె భర్తకు మద‍్ధతుగా క్యాథలిక్‌ జాయింట్ యాక్షన్ కమిటీ రోడ్డెక్కింది. ముఖ్యమంత్రి ఎన్‌ బిరెన్ కు గురువారం వినతిపత్రం కూడా సమర్పించింది. ‘ఒక గ్రామం.. ఒక విలువ’ అన్నది హక్కుల ఉల్లంఘనే అవుతుందని పేర్కొంటూ తక్షణమే దానిని రద్దు చేయాలని సీఎంను జేఏసీ కోరింది. 
 
ఇక గ్రామాధికారులు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ క్యాథలిక్‌ క్రిస్ట్రియన్లు ర్యాలీని నిర్వహించారు. తన భార్య(రీటా హవోరేయి)ను ఆమె సొంత ఊరు(లెయిన్‌గాంగ్‌చింగ్‌) లో ఖననం చేద్దామని యత్నిస్తున్న యంగ్మికి రాష్ట్రవ్యాప్తంగా మద్ధతు పెరుగుతోంది. ‘అతను(యంగ్మి) గ్రామ నిబంధనలు పదే పదే ఉల్లంఘించాడు. అందుకే అతన్ని గ్రామం నుంచి బహిష్కరించాం. ఇందులో మత ప్రమేయం అంటూ ఏం లేదు’ అని టంగ్లుక్‌ పెద్దలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే నెలలో నియాం ఖాసిమ్ అనే వ్యక్తి చనిపోగా, అప్పుడు కూడా ఇలాంటి వివాదమే చెలరేగటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఎట్టకేలకు ఖననం చేయించారు.
మరిన్ని వార్తలు