‘ఢిల్లీ ప‌రిస్థితి గురించి భయపడాల్సిన అవసరం లేదు’

28 Jun, 2020 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందన్న ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా వ్యాఖ్య‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. జూలై చివ‌రినాటికి ఢిల్లీ ఆసుప‌త్రుల్లో బెడ్లు కూడా ఖాళీగా ఉండ‌ని పరిస్థితి నెల‌కొంటుందంటూ ఆయన ఢిల్లీ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. అయితే ఆయన అంచ‌నా స‌రైన‌దా? కాదా? అని విష‌యంపై స్పందించ‌బోన‌ని తెలిపారు. కానీ సిసోడియా మాట‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల మ‌న‌సులో భ‌యం వెంటాడుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. (ఢిల్లీలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు)

"నీతి ఆయోగ్‌కు చెందిన డా.పౌల్‌, ఐసీఎమ్ఆర్‌ చీఫ్‌ డా.భార్గ‌వ‌, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్ట‌ర్‌ డా.గులేరియాల‌తో ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితిపై చ‌ర్చించాను. ఢిల్లీలో ఎక్క‌డా క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ లేదు. ఎక్కువ ప‌రీక్ష‌లు చేసినందున ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తింది. దీని గురించి అతిగా భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదు" అని అమిత్ షా స్ప‌ష్టం చేశారు. కాగా జూన్ 9న సిసోడియా మీడియా స‌మావేశంలో ఢిల్లీలో కేసుల సంఖ్య‌ జూలై 15 నాటికి 2.5 ల‌క్ష‌లు, జూలై 31 నాటికి 5.5 ల‌క్ష‌లకు చేరుకుంటాయ‌ని అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆదివారం నాడు మ‌నీష్ సిసోడియా మాట మార్చుతూ.. జూలై చివ‌రినాటికి 5.5 ల‌క్ష‌ల కేసులు క‌చ్చితంగా న‌మోదు కావ‌నే ధీమా వ్య‌క్తం చేశారు. (దేశంలో 5 లక్షలు)

మరిన్ని వార్తలు