మాతృభూమి సేవకు మనీషా కోయిరాలా

11 May, 2015 19:02 IST|Sakshi
మాతృభూమి సేవకు మనీషా కోయిరాలా

భారీ భూకంపంతో కకావికలమైన తన మాతృదేశం నేపాల్లో మహిళలకు సేవలందించేందుకు బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త మనీషా కోయిరాలా నడుం బిగించింది. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారితోపాటు భూకంపం ప్రభావంతో గర్భం కోల్పోయిన మహిళలు, ఇతర ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న బాలికలకు అవసరమైన మేరకు సేవలందించేందుకు సిద్ధమైంది.

ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ ఎఫ్పీఏ) నేపాల్ విభాగం గుడ్విల్ అంబాసిడర్గా నియమితురాలైన ఆమె.. కష్టకాలంలో మాతృదేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపం ప్రభావంతో దాదాపు లక్ష మందికిపైగా గర్భాన్ని కోల్పోయారని, మరో 1.30 లక్షల మంది ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరికీ వైద్యసేవలు అందించేందుకు యూఎన్ ఏఫ్ పీఏ కృషి చేస్తున్నదని ఆ సంస్థ నేపాల్ ప్రతినిధి గ్యూలియా వెల్లెస్ చెప్పారు. యూఎన్ ఎఫ్పీఏ నేపాల్ విభాగం గుడ్విల్ అంబాసిడర్గా మనీషా కోయిరాలా పనితీరు అందరినీ మెప్పిస్తుందన్నారు.

>
మరిన్ని వార్తలు