సమకాలీన మార్పులను గుర్తించాలి 

27 Apr, 2018 03:09 IST|Sakshi

సీహెచ్‌ హనుమంతరావు పుస్తకావిష్కరణ సభలో మన్మోహన్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. ‘మై జర్నీ ఫ్రమ్‌ మార్క్సిజం–లెనినిజం టు నెహ్రూవియన్‌ సోషలిజం: సమ్‌ మెమోరీస్, రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ఇంక్లూజివ్‌ గ్రోత్‌’పేరుతో ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్‌ హనుమంతరావు రాసిన పుస్తకాన్ని మన్మోహన్‌ సింగ్‌ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్‌ గాంధీల హయాంలో ప్రణాళిక సంఘం సభ్యుడిగా హనుమంతరావు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. మార్క్సిజం–లెనినిజం భావాల నుంచి నెహ్రూవియన్‌ సోషలిజం వైపు వచ్చేందుకు హనుమంతరావుకు ఎక్కువ సమయం పట్టలేదన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలను ఇప్పటికీ రూపుమాపలేకపోయామని ఇందుకు కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రొ.మనోరంజన్‌ మొహంతి, దీపక్‌ అయ్యర్, ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు