మన్‌కీ బాత్‌ కోసం రేడియో ఎంచుకోవడానికి కారణమిదే!

25 Nov, 2018 14:09 IST|Sakshi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ

50వ ఎపిసోడ్‌ పూర్తిచేసుకున్న ప్రధాని రేడియో కార్యక్రమం

పలు అంశాలపై మాట్లాడిన నరేంద్రమోదీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మన్‌ కీ బాత్‌’  రేడియో కార్యక్రమం నేటికి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘మీరెందుకు మన్‌ కీ బాత్‌ కార్యక్రమం కోసం రేడియోను ఎంచుకున్నారు. అది అంత పాపులర్‌ కాదు కదా’ అని తనను చాలామంది అడిగారని, దానికి తాను ‘1998లో నేనొక సామాన్య బీజేపీ కార్యకర్తగా ఉన్నపుడు, ఓ టీ కొట్టు దగ్గర టీ కోసం ఆగితే ఆ వ్యక్తి రేడియో ద్వారా అటల్‌ బిహారీ వాజ్‌పేయి తీసుకున్న న్యూక్లియర్‌ బాంబ్‌ నిర్ణయం గురించి వినడం చూశాను. అప్పటినుంచి రేడియో అనేది ఒక శక్తివంతమైన మాధ్యమమని తెలుసుకున్నాను’ అని తెలిపారు. అందుకే ప్రధాన మంత్రి అయ్యాక రేడియో ద్వారా మన్‌కీ బాత్‌ నిర్వహిస్తున్నానని చెప్పారు. 

తాజాగా ఆకాశవాణి సంస్థ నిర్వహించిన సర్వేలో మన్‌కీ బాత్‌ వల్ల దేశంలో సానుకూల ధోరణి పెరిగిందని, స్వచ్ఛందంగా సమాజ సేవకు పౌరులు ముందుకు వస్తున్నారని తెలిపారు. మన్‌కీ బాత్‌ను రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు కదా అన్న ప్రశ్నకు.. నేను ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. కానీ దేశంలో ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే మన్‌కీ బాత్‌ను రాజకీయాల కోసం ఉపయోగించకూడదనుకున్నానని మోదీ బదులిచ్చారు. మన్‌కీబాత్‌ కోసం మీరు ఎంత సమయం ప్రిపేర్‌ అవుతారన్న ప్రశ్నకు దీనికై ప్రత్యేకంగా సమాయత్తం కానని, మనసులో మాటే కాబట్టి చాలా సులువుగా చెప్పేస్తానని తెలిపారు. తాను ప్రయాణాలు చేసే సమయంలో భారత ప్రజలు పంపిన ప్రతిస్పందనలు, వాయిస్‌ మెసేజ్‌లను వింటానని తద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకోగలుగుతున్నానని అన్నారు. ప్రజలంతా తమ స్థానిక భాషల్లో మన్‌కీ బాత్‌ను వినాల్సిందిగా కోరారు. మన్‌కీ బాత్‌ ద్వారా పిలుపునిచ్చిన పరిసరాల పరిశుభ్రత, రోడ్డు భద్రత, డ్రగ్‌ ఫ్రీ ఇండియా, సెల్ఫీ విత్‌ డాటర్‌ వంటివి ప్రజల్లోకి బాగా వెళ్లాయన్నారు. యువత దృష్టికోణం నుంచే తాను ఆలోచిస్తానని అందుకే వారితో తొందరగా కలిసిపోతానని అన్నారు. పిల్లలకు పెద్దలకు మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాకుండా చూసుకోవాలని సూచించారు. యువత నుంచి తాను చాలా విషయాలు నేర్చుకుంటానని అన్నారు. యువతను ప్రశ్నలను అడగనివ్వాలని.. అప్పుడే సమస్యను వేర్ల వరకు తెలుసుకోగలమని అన్నారు. 

యువతకు ఓపిక తక్కువని చాలామంది అంటారని కానీ, యువత ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాలనుకుంటారని, అది వారిలోని మల్టీటాస్కింగ్‌ పవర్‌కు నిదర్శమని కొనియడారు. ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా పని చేసేవారే ఎక్కువ ఎత్తుకు చేరుకుంటారని అన్నారు. 1949 నవంబర్‌ 26న మనం రాజ్యాంగాన్ని స్వీకరించామని, ఈ సందర్భంగా లక్షలాది మందికి ఆత్మగౌరవాన్ని అందించిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను గుర్తుచేసుకోవాలని సూచించారు. అంబేద్కర్‌ భారత రాజ్యాంగానికి చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. 

నవంబర్‌ 23న గురునానక్‌ జయంతిని జరుపుకుంటామని, ఆయన ఆదర్శాలను అందరూ పుణికిపుచ్చుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరం గురునానక్‌ 550వ జయంతిని ఘనంగా జరుపుకోనున్నామని చెప్పారు. ​

మరిన్ని వార్తలు