డేరాల విధ‍్వంసం.. రాబర్ట్ వాద్రా ఆందోళన!

27 Aug, 2017 17:04 IST|Sakshi
డేరాల విధ‍్వంసం.. రాబర్ట్ వాద్రా ఆందోళన!

న్యూఢిల్లీ: హరియానాతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధ్వంసకాండపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తీవ్రంగా స్పందించారు. డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం మద్ధతుదారులు చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ 36 మంది మృతిచెందడంతో పాటు 250కి పైగా మంది గాయపడ్డారని.. దీనికి హరియానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదివారం ఆయన డిమాండ్ చేశారు. గుర్మీత్ అనుచరుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించి, ఎన్నోసార్లు విచారణ చేపట్టి వేధించారని.. ఇంటిగ్రిటీ లేదని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హరియానాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించలేని వ్యక్తి సీఎం హోదాలో ఉండేందుకు అనర్హుడని వాద్రా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గుర్మీత్ ఆస్తులు వేలం వేసి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని పంజాబ్, హరియానా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించడాన్ని వాద్రా మెచ్చుకున్నారు.

స్వేచ్ఛగా ప్రాణాలతో బతికేందుకు హరియానా ప్రజలకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే దేశంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2002లో జరిగిన అత్యాచారాల కేసులో డేరా అధిపతి గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హరియాణలో ఆయన మద్దతుదారులు హింసాకాండను సృష్టించారు. 

>
మరిన్ని వార్తలు