స్కూటర్‌ నడపాలన్నా భయమే : పరీకర్‌

18 Mar, 2019 11:21 IST|Sakshi

పణజి : నిరాడంబర సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్‌ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్‌ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా ఉండే పరీకర్‌ గురించి పలు ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పరీకర్‌ ఇతర మంత్రుల లాగా సూటు బూటు ధరించేవారు కారు. కొల్హాపూర్‌ చెప్పులు, సాధరణ వస్త్రధారణనే ఇష్టపడేవారు. సీఎం పదవిలో ఉండి కూడా స్కూటర్‌ మీదనే తిరిగేవారు.

రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కిచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పాశ్చత్య వస్త్ర ధారణ నాకు అంతగా నప్పదు. కానీ గత రక్షణశాఖ మంత్రలు కంటే నా వస్త్రధారణ బాగానే ఉంటుంది. ఇకపోతే డిఫెన్స్‌ మినిస్టర్‌గా ఉంటూ కొల్హాపూర్‌ చెప్పులు ధరించడమే కాస్తా ఇబ్బందికరంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక గోవా సీఎంగా ఉన్నప్పుడు స్కూటర్‌ మీదనే తిరుగుతుండేవారు పరీకర్‌.

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు ఎప్పుడూ స్కూటర్‌ మీదనే తిరుగుతారా’ అని జనాలు నన్ను అడుగుతారు. కానీ ఎల్లకాలం ఇలానే తిరగలేను. ఎందకంటే నా మైండ్‌లో ఎప్పడు పని గురించిన ఆలోచనలే ఉంటాయి. నేను స్కూటర్‌ నడిపేటప్పుడు నా మైండ్‌ మరో చోట ఉంటుందనుకొండి.. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. అందుకే స్కూటర్‌ నడపాలంటే నాకు భయం’ అని తెలిపారు పరీకర్‌.

మనోహర్‌ పరీకర్‌ అంత్యక్రియలను పణజిలోని మిరమార్‌ బీచ్‌లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తారని సీఎంఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్‌ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా హాజరయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పరీకర్‌ మృత దేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పణజీ కళా అకాడమీకి తరలించారు.

మరిన్ని వార్తలు