‘లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించలేదు’

25 May, 2020 21:24 IST|Sakshi

బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు నిబంధనలు, మర్గదర్శకాలను పాటిస్తూ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్ తివారీ హర్యానాలోని సోనిపట్ జిల్లా షేక్‌పురాలో ఉన్న క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఓ క్రికెట్‌ మ్యాచ్‌లో సోమవారం పాల్గొన్నారు. క్రికెట్‌ ఆడుతున్న క్రమంలో మనోజ్‌ తివారి తన ముఖానికి మాస్క్‌ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను ఎంపీ ఉల్లఘించారంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తనపై వస్తున్న విమర్శలపై ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు.

‘లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన సామాజిక దూరం నిబంధనలను పాటించాను అని తెలిపారు. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు ప్రారంభించుకోవాలని హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తాను సోనిపట్‌ క్రికెట్‌ అకాడమీలో క్రికెట్‌ ఆడినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించలేదని పేర్కొన్నారు. సోషల్‌ మీడియలో వైరల్‌గా మారిన ఫొటోల్లో ఎంపీ మనోజ్‌ తివారీ ముఖానికి మాస్క్‌ ధరించకుండా, సామజిక దూరం పాటించకూడా ఉన్నట్లు కనిపిస్తోంది.  దేశంలో కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా 6,977 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,38,845కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు