చిన్న పార్టీలతో ఫలితం తారుమారు!

13 Feb, 2017 01:04 IST|Sakshi
చిన్న పార్టీలతో ఫలితం తారుమారు!

యూపీ ఎన్నికల బరిలో అనేక చిన్నా చితకా పార్టీలు
► అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం
► కుల ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్న పార్టీలు

లక్నో: ఈసారి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చిన్నా చితకా పార్టీలు అదృ ష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడమే కాక, అభ్యర్థుల విజయావకాశాల్ని కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలో కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా మరికొన్ని ప్రధాన పార్టీలకు మద్దతు ప్రకటించాయి. వివిధ కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.  

పీస్‌ పార్టీ, నిషాద్‌ పార్టీ, మహాన్  దళ్‌కు కొన్ని కులాల్లో మంచి పట్టుంది. రాష్ట్ర ఓటర్లలో 4.5 శాతం ఓట్లున్న మలాహ్‌ కులం (మత్స్యకారులు, పడవ నడిపేవారు) ఓట్లపై నిషాద్‌ పార్టీ ఎక్కువగా ఆధారపడింది. యూపీలోని నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 125 నియోజకవర్గాల్లో ఈ కులం ఓట్లు కీలకం కానున్నాయి. సంజయ్‌ సింగ్‌ చౌహాన్  నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీకి రాజ్‌భర్‌ కులంలో మంచి పట్టుంది. అలాగే బదౌనీ, ఇటావా, బరేలీ, షాజహాన్ పూర్, ఫర్రుఖాబాద్‌ ప్రాంతాలపై మహాన్ దళ్‌ ఆశలు పెట్టుకోగా... శాక్య, మౌర్య, కుశ్వాహ, సైనీ వర్గాల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంది. అందుకే ఇటీవల బీఎస్పీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్యను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరో నేత కేశవ్‌ ప్రసాద్‌మౌర్యను రాష్ట్ర విభాగం అధ్యక్షుడ్ని చేసింది.

ముస్లింల్లో పీస్‌ పార్టీకి పట్టు
ఇక ముస్లింల్లో మంచి పట్టున్న పీస్‌ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ముస్లిం ఓట్లు తమకే పడతాయని పీస్‌ పార్టీ ధీమాగా చెబుతోంది. ఇంతవరకూ ప్రధాన పార్టీలు లేవనెత్తని అంశాల్ని తెరపైకి తీసుకొస్తూ... పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ వికాస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్‌ నేతృత్వంలోని యూపీఏ మిత్రపక్షం అప్నాదళ్‌ పశ్చిమ యూపీలోని 10 స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది.

మహిళలు, రైతుల సంక్షేమం
కోసం మరికొన్ని: మహిళల భద్రత పశ్చిమ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎజెండా కావడంతో.. మహిళా శక్తికరణ్‌ పార్టీ ఆ అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు ప్రయత్ని స్తోంది. బ్రిజ్‌ క్రాంతిదళ్‌ నేతలు బ్రిజ్‌ ప్రాంత చరిత్రను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మధుర, జలేసర్, భరత్‌పూర్‌ తదితర ప్రాంతాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కాగా భారతీయ కిసాన్  యూనియన్ (బీకేయూ) వంటి పార్టీలు ఎన్నికల బరిలో లేకపోయినా పెద్ద పార్టీలకు ఓట్ల సాయం చేస్తున్నాయి. సమాజంలో వెనకబడ్డ వర్గాల సమస్యల్ని ప్రస్తావిస్తూ భారతీయ వంచిత్‌ సమాజ్‌ పార్టీ, భారతీయ కర్యస్థ సేన, కిసాన్  మజ్దూర్‌ సురక్ష పార్టీ, భారతీయ భాయ్‌చరలు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ముజఫర్‌నగర్‌ అల్లర్ల తర్వాత తెరపైకి వచ్చినవే. మత సామరస్యత కోసం తమకు ఓటేయమని అభ్యర్థిస్తున్నాయి.   

కానరాని ప్రముఖులు
ఈ సారి యూపీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రముఖుల సందడి తగ్గింది. మొదటి రెండు దశల ఎన్నికల ప్రచారానికి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలు దూరంగా ఉన్నారు. కావాలనే ములాయం ప్రచారానికి దూరం కాగా... అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనలేదు.  తన కుమారుడికి రాంనగర్‌ సీటు ఇవ్వకపోవడంతో మరో సీనియర్‌ నేత బేణీ ప్రసాద్‌ వర్మ కూడా ప్రచారాన్ని విరమించుకున్నారు.  బీజేపీ నుంచి ఎల్‌కే అద్వానీ, బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హా ఈసారి ప్రచారానికి దూరమయ్యారు.

మరిన్ని వార్తలు