రెండోసారి ప్రధాని అయ్యాక తొలిసారి..

30 Jun, 2019 13:18 IST|Sakshi

‘మన్‌కీ బాత్‌’లో దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: మేరే ప్యారీ దేశ్‌ వాసియోం... అంటూ 130 కోట్లమంది భారతీయుల్ని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పలకరించారు. లోక్‌సభ ఎన్నికల ముందు విరామం ఇచ్చిన రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌కి తిరిగి శ్రీకారం చుట్టారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేడియో ద్వారా తొలిసారి తన మనసులోని మాటను దేశప్రజలతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నీటి సమస్యను మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. జలసంరక్షణకు కలసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు మూడు కీలక సూచనలు చేశారు ప్రధాని మోదీ. నీటి పరిరక్షణపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ప్రముఖులకు పిలుపునిచ్చారు. సంప్రదాయ జలసంరక్షణ పద్ధతులను తెలియజేయాలని కోరారు. జలసంరక్షణకు కృషిచేస్తున్న ఎన్జీవోలు, వ్యక్తుల గురించి తెలిస్తే వారి వివరాలు అందరికీ తెలిసేలా చేయాలని విజ్ఞప్తిచేశారు. జలసంరక్షణకు సంబంధించిన ఏ సమాచారం అయినా హ్యాష్‌టాగ్‌ జన్‌శక్తి ఫర్ జల్‌శక్తికి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 

మన్‌కీ బాత్‌ని తాను ఎంతో మిస్ అయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఆదివారం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశానని చెప్పారు. ఎంతోమంది ప్రజలు మన్‌కీ బాత్‌ను మిస్సవుతున్నట్టు తనకు చెప్పారని తెలిపారు. 130 కోట్లమంది భారతీయుల ఆత్మబలానికి ఈ కార్యక్రమం నిరదర్శనమన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మన్‌కీ బాత్‌కి విరామం ఇస్తూ మళ్లీ వస్తా అని చెబితే... చాలామంది తనది అతివిశ్వాసం అనుకున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాని ప్రజలపై తనకి ఎప్పుడూ విశ్వాసం ఉందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో భారతీయులు ఓటుహక్కు వినియోగించుకున్నారని... ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది గీటురాయని తొలి మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు ప్రధాని మోదీ.

మరిన్ని వార్తలు