భారత్‌పై చైనా యుద్ధానికి కారణాలివీ..

25 Dec, 2017 04:14 IST|Sakshi

‘చైనాస్‌ ఇండియా వార్‌’ పుస్తకంలో వెల్లడి

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధానికి వివాదాస్పద హిమాలయ ప్రాంత సరిహద్దే ముఖ్య కారణమని చెబుతున్నా ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. కమ్యూనిస్ట్‌ నేత మావో జెడాంగ్‌ చైనాలో తన అధికారాన్ని తిరిగి బలోపేతం చేసుకునేందుకే మన దేశంపై యుద్ధం ప్రకటించారని కొత్త పుస్తకం ఒకటి వెల్లడించింది. స్వీడన్‌ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బెర్టిల్‌ లిట్నర్‌ రాసిన ‘చైనాస్‌ ఇండియా వార్‌’ అనే ఈ పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది. భారత్, చైనా యుద్ధానికి ఈ పుస్తకంలో పేర్కొన్న ఇతర కారణాలు..
► ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు’ సారథిగా ఎదగకుండా భారత్‌ను అడ్డుకోవడం
► చైనా ఆధునికీకరణకు మావో ప్రారంభించిన ‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’ విధానం ఘోర ఫలితాన్నివ్వడం
► మావో అనుసరించిన విధానాల వల్ల ముఖ్యంగా శరవేగంతో సాగిన పారిశ్రామికీకరణ తీవ్ర కరువు కాటకాలను మిగిల్చింది. దీంతో దాదాపు కోటీ 70 లక్షల నుంచి 4 కోట్ల 50 లక్షల ఆకలి చావులు జరిగాయి. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.
► 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించడంతో ఆ దేశ బౌద్ధ గురువు దలైలామా భారత్‌లో రక్షణ పొందారు. అప్పటినుంచే చైనా ఇండియాను ‘సున్నిత లక్ష్యం’గా ఎంచుకుంది.
► ఆసియా భూభాగం మొత్తాన్ని జయించడం లేదా తన గుప్పిట్లో పెట్టుకోవడం చైనా విధానం కాదు. కానీ ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలన్నిటి కన్నా తాను భౌగోళికంగా, రాజకీయంగా సుస్థిరంగా ఉండాలనేదే ఆ దేశ లక్ష్యం. భారత్‌పై యుద్ధంలో గెలవడం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంది.
► చైనా బలగాలు భారత్‌లోకి ప్రవేశిస్తుండటం పట్ల అప్పటి నిఘా విభాగం అధిపతి ఎప్పటికప్పుడు హెచ్చరించినా.. ప్రధాని నెహ్రూ నమ్మలేదు.         

మరిన్ని వార్తలు