మావోయిస్టు ప్రేమజంట లొంగుబాటు

25 Nov, 2017 11:55 IST|Sakshi
ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ప్రేమజంట

మల్కన్‌గిరి: దళంలో ఉంటూ ప్రేమించుకున్న మావోయిస్టు జంట మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గామోహన్‌ మిన్నా ఎదుట శుక్రవారం లొంగిపోయింది. సోనా ఓర్మి, బిజాల కాడిమేలు అనే వ్యక్తులు 2009లో గంగుళూర్‌ దళంలో చేరారు. 2010లో మల్కన్‌గిరి జల్లాకు వచ్చి అప్పటినుంచి పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. గోవిందపల్లి ఔట్‌పోస్ట్‌ పేల్చివేత, దమన్‌జోడి ఎటాక్, శ్రీరాంపూర్‌లో పోలీస్‌ వాహనంపై దాడి, 2010లో 76మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చిన ఘటనలో ఈ మావోయిస్టు జంట ముఖ్య పాత్ర పోషించింది. వీరిద్దరూ దళంలో ఉంటూనే ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ విషయాన్ని దళంలోని అగ్రనేతలకు  తీసుకువెళ్లగా దళంలో ప్రేమ వ్యవహారాలు కుదరవంటూ మండిపడ్డారు.

దీంతో మనస్తాపం చెందిన వారు  జనజీవన స్రవంతిలో కలిసిపోదామని నిర్ణయించుకుని లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు మావోయిస్టుల నుంచి రక్షణ లేదు. దళంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. అందుచేతనే జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలకు, గిరిజనులకు సేవ చేద్దామని భావించి లొంగిపోయామని తెలియజేశారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్పీ జోగ్గామోహన్‌ మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందజేసే పథకాలను త్వరలోనే వీరికి అందజేస్తామని చెప్పారు.  వీరిద్దరిది జాజ్‌పూర్‌ జిల్లా. వీరిలో ఒక్కొక్కరిపై రూ.రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు.  వీరి లాగానే మిగిలిన సభ్యులు కూడా దళాన్ని వీడి వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని  ఎస్పీ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు