మావోయిస్టులకు విరాళాలపై కేంద్ర హోంశాఖ నిఘా

9 May, 2018 10:46 IST|Sakshi
రాజ్‌నాథ్‌సింగ్‌ (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: మావోయిస్టుల ఆర్థిక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు వారి పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం లక్షల రూపాయలు దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. వారి పిల్లలకు, బంధువులకు ప్రొఫెషనల్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, మెడికల్‌ సీట్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టులకు వస్తున్న నిధులను గుర్తించేందుకు ప్రత్యేక గూఢాచార పరిశోధనా సంస్థలను, టాక్స్‌ విభాగాలను ఏర్పాటు చేయనున్నుట్లు మంగళవారం ఉన్నతాధికారుల సమావేశంలో ప్రకటించారు. హోంశాఖ అధికారుల సమాచారం ప్రకారం కీలకమైన మావోయిస్టులపై పలు ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి.

వారిలో ముఖ్యంగా... బిహార్‌, జార్ఖండ్‌ ఏరియాల్లో మావోయిస్టు నేత ప్రదీమన్‌ శర్మపై పలు కేసులు నమోదయ్యాయి. తన మేనకోడలు మెడికల్‌ సీటు కోసం 2017లో రూ. 22 లక్షలు ప్రైవేట్‌ కాలేజీకి చెల్లించారని పోలీసులు తెలిపారు. బిహార్‌ మావోయిస్టు సీనియర్‌ నేత సందీప్‌ యాదవ్‌పై కూడా పలు కేసులున్నాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో 15 లక్షల రూపాయలను అక్రమంగా మార్పిడి చేశారని పోలీసులు గుర్తించారు. జార్ఖండ్‌ మావోయిస్టు అరవింద్‌ యాదవ్‌ తన సోదరుడి చదువుల కోసం రూ. 12 లక్షలు ఇంజినీరింగ్‌ కాలేజీలో చెల్లించడంపై కేసు నమోదు చేసినట్లు జార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు.

ఇలా భారీగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న మావోయిస్టులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌  కేసులు నమోదు చేసింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్‌ నేత బాలమూరి నారాయణ అలియాస్‌ ప్రభాకర్‌ కూడా భారీగా ఆర్థిన నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ప్రస్తుతం 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలకు వస్తున్న విరాళాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన నేపథ్యంలో.. నిషేధిత సంస్థలకు వెళ్తున్న ఫండ్‌ను గుర్తించేందుకు పలు సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు