ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు

5 Oct, 2018 20:02 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు మరోసారి కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగునున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మావోయిస్టులు అత్యంత ప్రభావిత ప్రాంతమైన బీజాపుర్‌ జిల్లాలో శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకూడదని.. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ బ్యానర్లు కట్టారు. ​కాగా ఇటీవల జరిగిన అరకు టీడీపీ నేతల జంట హత్యల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతాదళాలు ఇప్పటికే హైఅలర్టు ప్రకటించాయి.

ముఖ్యంగా ఎన్నికలు జరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు గతంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భధ్రతా దళాలను మోహరించనుంది. కాగా డిసెంబర్‌లో రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా అసెంబ్లీలో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు