మావోలకు సహకరిస్తే కఠిన చర్యలు: కేంద్రం

17 Jul, 2014 02:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మావోయిస్టులకు సహకరించే స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నామని కేంద్రం హెచ్చరించింది. ఆయా సంస్థలు చట్టపరంగా విరాళాలు సేకరించి మావోకు అందించడం ద్వారా.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు బుధవారం తెలిపారు. దేశంలోని కొందరు నక్సల్స్ ఫిలిప్పీన్స్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి శిక్షణ పొందినట్లు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

ముంబై దాడుల తర్వాత తీరప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు రిజిజు తెలిపారు. తూర్పు, పశ్చిమ తీరాల వెంట పెట్రోలింగ్‌ను పెంచామని రాజ్యసభకు చెప్పారు.  వివిధ విభాగాలతో సమాచారం పంచుకునేందుకు నావికాదళం ముంబై, విశాఖపట్నం, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్‌లో కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన తీవ్రవాద కేసుల్లో విడుదలవుతున్న వారందరినీ నిర్దోషులని చెప్పలేమని రిజిజు అన్నారు.  అనేక కేసుల్లో సాక్ష్యాలు లేకనే నిందితులు విడుదలవుతున్నారన్నారు.
 

మరిన్ని వార్తలు