ట్రై జంక్షన్‌ ఎందుకు కీలకం?!

3 Oct, 2017 09:07 IST|Sakshi

విస్తరణకై మావోయిస్టుల వ్యూహం

మధ్యప్రదేశ్‌లోని ట్రై జంక్షన్‌పై కన్ను

బస్తర్‌, ఏవోబీ, నల్లమల ఇక సురక్షితం కాదేమో?!

మధ్యప్రదేశ్‌లో రిక్రూట్‌మెంట్లు

తేల్చి చెప్పిన కేంద్ర నిఘా వర్గాలు

మావోయిస్టులు మళ్లీ తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? కొత్త ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నారా? ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో కొత్త ప్రాంతాలపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర నిఘా వర్గాలు.

సాక్షి, న్యూఢిల్లీ : ఏవోబీ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు, తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్‌లో ఇప్పటికే మావోయిస్టల కీలక స్థావరాలను పోలీసులు ధ్వంసం చేసిన నేపథ్యంలో కొత్త ప్రాంతాల్లో పాగా వేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్‌-మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు అయిన బాలాఘాట్‌ జిల్లాను కేంద్రంగా మార్చుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ఈ జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కావడం..  అక్కడ వామపక్ష భావజాలాన్ని పెంచితే ఉనికి మళ్లీ కాపాడుకోవచ్చని వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మిలిటరీ బ్రిగేడ్‌
ట్రై జంక్షన్‌లో ఇప్పటికే మావోయిస్టులు విస్తారా బ్రిగేడ్‌ పేరుతో రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రిక్రూట్‌మెంట్లకు, పార్టీ విస్తరణకు కీలక మావోయిస్ట్‌ నేత అయిన సుధాకర్‌ వ్యూహరఛన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా.. చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లలో కీలకంగా పనిచేసిన సుధాకర్‌.. అక్కడ పోలీస్‌ దాడులు, కూంబింగ్‌లు అధికం కావడంతో.. కొన్నేళ్ల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సురక్షిత ప్రాంతం కోసమే
కొన్నేళ్లుగా మావోయిస్టులకు బలమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్‌కౌంటర్లలో కీలక నేతలు హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలను కూడా పూర్తిగా పోలీసులు జల్లెడ పట్టేశారు. దీంతో చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అటవీ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ కూడా పరిస్థితులు విషమంగా ఉండడంతో సురక్షిత, రక్షణ ప్రదేశం కోసం మావోయిస్టులు కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ అటవీ ప్రాం‍తాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోం‍ది.

మరిన్ని వార్తలు