ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఊచకోత

23 Jan, 2019 03:17 IST|Sakshi

ముగ్గురిని చంపిన మావోలు

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘటన  

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్‌ తాలూకాలోని తాడ్‌గావ్‌ పోలీస్‌స్టేషన్‌ దగ్గర్లో మావోయిస్టులు ముగ్గురిని హత్య చేశారు. బాంబ్రాగాడ్‌ తాలూకా కసన్‌సూర్‌ గ్రామానికి చెందిన ఆరుగురిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ముగ్గురిని సోమవారం అర్ధరాత్రి దారుణంగా చంపి నడిరోడ్డుపై పడేశారు. ఘటనాస్థలిలో ఎర్రరంగు బ్యానర్లతోపాటు మావోల పేరుతో లేఖలను వదిలేశారు.

గత ఏడాది ఏప్రిల్‌ 22న బాంబ్రాగాడ్‌ తాలూకా పరిధి బోరియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తాము చంపేసిన ఆ ముగ్గురు ఇన్‌ఫార్మర్ల కారణంగానే గత ఏప్రిల్‌లో మావోల జాడ పోలీసులకు తెలిసిందని, మావోల మరణానికి ఈ ముగ్గురు ఇన్‌ఫార్మర్లే కారణమని బ్యానర్లు, లేఖలో మావోలు పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన మిగతా ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యల నేపథ్యంలో కసన్‌సూర్‌ గ్రామంలో భయానకవాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు