హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ల ఉద్యమం

24 Jul, 2018 15:11 IST|Sakshi

ముంబై : రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా గత కొంత కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల రైతు కాకాసాహెబ్‌ శిండే  గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ వర్గం నేతలు మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలిపునిచ్చారు. ఔరంగబాద్‌లో ఈ రోజు ఉదయం బంద్‌లో పాల్గొన్న ఓ నిరసనకారుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. బ్రిడ్జిపై నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

మరాఠా సామాజిక వర్గం తలపెట్టిన ఈ బంద్‌ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రతో పాటు, ఔరంగబాద్‌, ఉస్మాన్‌బాద్‌, బీడ్‌, అహ్మాద్‌నగర్‌ ప్రాంతాల్లో అధికంగా ఉంది. నిరసనకారులు ఔరంగబాద్‌లో పలు వాహనాలపై దాడికి దిగారు. ఉస్మాన్‌బాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల ముందు టైర్లను కాల్చివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ క్షమాపణలు చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని మరాఠా రిజర్వేషన్ల సమితి నేత రవీంద్ర పాటిల్‌ తెలిపారు. అవసరమైతే ముంబైలో తాము ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ ఆందోళనలపై  ఫడ్నవీస్‌ స్పందిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఆందోళకారులను శాంతియుతంగా ఉండాలని కోరారు. కాగా ఫడ్నవీస్‌ ఆదివారం రోజున సోలాపూర్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా అక్కడ కొందరు మరాఠా నాయకులు తనపై దాడి చేస్తారనే కారణంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ మరాఠా సామాజిక వర్గం నేతలు ఆందోళనలు చేపట్టారు.


 

మరిన్ని వార్తలు