ఇక మరాఠాల వంతు..!

27 Dec, 2017 14:46 IST|Sakshi

సాక్షి, ముంబై : గుజరాత్‌లో పటేదార్ల రిజర్వేషన్‌ ఉద్యమంతో స్ఫూర్తిపొందిన మరాఠాలు.. మహారాష్ట్రలో మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. మరాఠా యోధుడు శివాజీ జన్మదినమైన పిబ్రవరి 19 నుంచి రిజర్వేషన్ల కోసం ఉద్యమించేందుకు మరాఠాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గుజరాత్‌లో పటేదార్లు ఉద్యమం, ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019లో మహారాష్ట్ర శాసనసభ, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. పటేదార్ల తరహా ఉద్యమాన్ని నిర్మించేందుకు మరాఠాలు సిద్ధమవుతున్నారు. 

ఉద్యమ నిర్మాణం గురించి మరాఠా నేతలు.. మంగళవారం సమావేశమయ్యారు. మరోదశ ఉద్యమాన్ని శివాజీ చక్రవర్తి జన్మదినం నాడు మొదలు పెట్టి.. 2019లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు 2019లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆలోపే లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యమ నేతలు తెలిపారు. 

మరాఠాలు కోరికేంటి?
విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ.. మరాఠాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నారు. 

ఉద్యమానికి కారణాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో.. వారికే విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. రిజర్వేషన్ల ఆసరాతో ఆయా వర్గాలు వేగంగా పురోగమిస్తున్నాయి. అదే రీతిలో మరాఠాలు తిరోగమిస్తున్నారు. బీజేపీ 2014 ఎన్నికల తరువాత బ్రాహ్మణ వర్గానికి చెందిన దేవేంద్ర పఢ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో.. మరాఠాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

ఫలితాలను మార్చే మరాఠాలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను, పార్టీల తలరాతలను మరాఠాలు మార్చగలరు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో మరాఠాలు ఫలితాలను తారుమారు చేయగలరు. మొత్తం మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33 శాతం వరకూ ఉన్నారు. చెక్కెర కర్మాగారాలు, విద్యాసంస్థలు, కో-ఆపరేటిక్‌ సెక్టార్‌లలో మరాఠాలది తిరుగులేని ఆధిపత్యం.

మరిన్ని వార్తలు