‘ఆయన బ్రిటిష్‌ ఏజెంట్‌’

23 Jan, 2020 12:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ మద్దతుగా నిలిచారు. పెరియార్‌ బ్రిటిష్‌ ఏజెంట్‌గా వారి విభజించి పాలించే విధానాన్ని ముందుకు తీసుకువెళ్లారని కట్జూ ఆరోపించారు. తమిళ మ్యాగజైన్‌ తుగ్లక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెరియార్‌పై రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో సీతారాముల విగ్రహాలకు చెప్పుల దండ వేసి చేపట్టిన ర్యాలీలో పెరియార్‌ పాల్గొన్నారని ఈ వార్తను ఏ ఒక్కరూ కవర్‌ చేయలేదని రజనీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. పెరియార్‌పై రజనీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై జస్టిస్‌ కట్జూ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో స్పందించారు.

బ్రిటిష్‌ పాలకులకు ఊడిగం చేసిన ఇతరులెందరి మాదిరిగానే పెరియార్‌ కూడా బ్రిటిష్‌ ఏజెంటేనని..ఆయన ఉద్దేశాలు ఏమైనా బ్రిటిషర్ల విధానమైన విభజించి పాలించనే సిద్ధాంతానికి అనుగుణంగా పెరియార్‌ వ్యవహరించారని అన్నారు. దీనిపై పలు వెబ్‌సైట్లు, తన బ్లాగ్‌లో రాసిన వ్యాసాలను పరీశీలించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. కాగా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడంపై 2017లో మార్కండేయ కట్జూ విమర్శలు గుప్పించడం విశేషం. పేదరికం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలకు రజనీ వద్ద పరిష్కారం ఉందా అంటూ తన బ్లాగ్‌లో ఆయన తమిళ సూపర్‌స్టార్‌ రజనీని ప్రశ్నించారు.

చదవండి : పెరియార్‌పై వ్యాఖ్యలు : క్షమాపణకు సూపర్‌స్టార్‌ నో..

మరిన్ని వార్తలు