కన్న కూతురుని చూడకుండానే..వీరమరణం

15 Feb, 2019 17:12 IST|Sakshi

జైపూర్‌ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. రాజస్తాన్‌లోని జైపూర్‌ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్‌ లంబా(27) సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్‌ లంబా 25 ఏళ్లకే  సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగం రాగా, మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు.

అయితే గతేడాది డిసెంబర్‌లో రోహితేష్‌ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరీత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతరును చూడలేకపోయారు. బిడ్డను చూసేందుకు సెలవుపెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతరును చూడడానికి వస్తాడనుకున్న భర్త  ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది.  రోహితేష్‌ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.

జమ్మూకశ్మీర్‌లో పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో ఆత్మాహుతి కారు ఢీకొన్న బస్సు తుక్కుతుక్కుకావడంతో పాటు జవాన్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.  పేలుడుతో ఘటనాస్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు