పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే

26 Feb, 2019 03:11 IST|Sakshi

ఏడుగురి చేతులు మారిన కారు

ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడి

న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్‌ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్‌ నంబర్‌ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్‌నాగ్‌ జిల్లా కేంద్రంలోని హెవెన్‌ కాలనీకి చెందిన జలీల్‌ అహ్మద్‌ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు.

అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహారాకు చెందిన సజ్జాద్‌ భట్‌కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్‌లోని సిరాజ్‌–ఉల్‌–ఉలూమ్‌ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్‌ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్‌కు చెందిన ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు