ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్

18 Apr, 2015 02:12 IST|Sakshi
ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్

గృహనిర్బంధంలో హురియత్ చైర్మన్ గిలానీ
శ్రీనగర్‌లో అల్లర్లు.. పలువురికి గాయాలు

 
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వేర్పాటువాదులు నిర్వహించ తలపెట్టిన  నిరసన ర్యాలీ  హింసాత్మకంగా మారింది. శ్రీనగర్ నుంచి త్రాల్ వరకు జరపాల్సిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో ఘర్షణ చెలరేగింది. ఇటీవల  పుల్వామా జిల్లాలో సైన్యం చేతిలో ఇద్దరు యువకులు చనిపోయినందుకు నిరసనగా ఈ ర్యాలీని వేర్పాటువాదులు తలపెట్టారు. ఈ ర్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ పాల్గొనకుండా ఆయన్ను గురువారం రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా,   బుధవారం శ్రీనగర్‌లో జరిపిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేసిన వేర్పాటువాదనేత మసరత్ ఆలం భట్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బుడ్గాం కోర్టు ఆయనను 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో  రాష్ర్టంలో హింస చెలరేగింది. దేశ వ్యతిరేక చర్యలను సహించబోమని, పాక్ జెండాలు ప్రదర్శించిన, నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  

పుల్వామా ఎన్‌కౌంటర్ నకిలీదని స్థానికులు అంటుండగా, మృతులు ఉగ్రవాదులని సైన్యం చెబుతోంది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ శుక్రవారం నిర్వహించిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. శ్రీనగర్‌లో హురియత్ మద్దతుదారులు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో డజను మంది గాయపడ్డారు. కాగా రాష్ర్టంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆలం మళ్లీ జైలుకే వెళతాడని, దేశ సమగ్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆలం అరెస్ట్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేయలేదని బీజేపీ పేర్కొంది. రాజ్‌నాథ్ సూచనల మేరకే రాష్ర్ట ప్రభుత్వం స్పందించిందని తెలిపింది. మరోవైపు తన అరెస్ట్ కొత్తేమీ కాదని, రాష్ర్టంలో పాక్ జెండాలను ప్రదర్శించడం, అనుకూల నినాదాలు చేయడం కూడా కొత్త కాదని మసరత్ ఆలం అన్నారు.  
 
జాతీయ జెండా దహనం

ఇద్దరు యువకుల ఎన్‌కౌంటర్‌పై హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ వర్గం శుక్రవారం నౌహట్టాలో నిర్వహించిన నిరసన ప్రదర్శన అల్లర్లకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు జాతీయ జెండాను తగులబెట్టారు. హురియత్ నేతల అరెస్ట్‌పై ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు చెలరేగాయి. పలుచోట్ల భద్రతాదళాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. మిలిటెంట్ల పేరుతో అమాయక యువకులను సైన్యం పొట్టనబెట్టుకుంటోందని ఫరూఖ్ మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ చైర్మన్ గిలానీ శనివారం కశ్మీర్ లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు