జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తత

5 Jan, 2020 20:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్క్‌లు ధరించిన కొందరు క్యాంపస్‌లోకి ప్రవేశించి విద్యార్ధులు, ప్రొఫెసర్లను చితకబాదడంతో పాటు వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విద్యార్థి సంఘం నేతతో పాటు పలువురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై దాడికి తెగబడిన గూండాలు ఇప్పటికీ క్యాంపస్‌ హాస్టల్స్‌లోనే ఉన్నారని విద్యార్ధులు ఆరోపించారు. క్యాంపస్‌లో దుండగులు భయోత్పాతం సృష్టించినా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు చోద్యం చూశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాకేత్‌ మూన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఏబీవీపీ గూండాలే తమపై దాడికి తెగబడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించగా, వామపక్ష విద్యార్ధులు తమ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముసుగు ధరించిన 50 మంది దుండగులు క్యాంపస్‌లోకి ప్రవేశించి హాస్టల్‌ రూమ్‌ల్లోకి చొరబడి విద్యార్ధులను చితకబాదారు. కనిపించిన ప్రొఫెసర్లపై సైతం వారు విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు