పాక్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచే ఉగ్ర కుట్ర

17 Feb, 2019 12:07 IST|Sakshi

ముంబై: పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్‌ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేశాడు. అనారోగ్య కారణాలతో కొన్ని నెలలుగా ఆర్మీ బేస్‌ ఆస్పత్రిలో మసూద్‌ చికిత్స తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఆరు నెలలుగా ఉగ్ర సమావేశాలకు కూడా మసూద్‌ దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కడి నుంచే పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కేవలం ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

భద్రతా దళాల చేతిలో గతేడాది అక్టోబరులో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది. ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లాడుతున్నారు. కానీ, మీరు మాత్రం సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆ ఆడియోలో అన్నట్లు ఉంది. తన సోదరుడు కుమారుడు మహ్మద్‌ ఉమేర్‌, అబ్దుల్ రషీద్ ఘాజీల సాయంతో ఈ ఆడియో టేపు ద్వారా కశ్మీర్ లోయలోని యువకుల మనసులో విషబీజాల్ని నాటించాడు.  శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి దాడులకు పాల్పడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫర్‌బాద్‌లో జరిగిన సమావేశంలో చర్చించారని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక్కడ చదవండి: దాడి సూత్రధారి ఉమేర్‌

మరిన్ని వార్తలు