మసూద్‌కు సైనిక ఆస్పత్రిలో చికిత్స

3 Mar, 2019 05:31 IST|Sakshi

జైషే అధినేతకు మూత్రపిండాల వ్యాధి

ప్రకటించిన పాకిస్తాన్‌ అధికారులు

న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలకు, పాక్‌ సైన్యానికి ఉన్న సంబం ధం మరోసారి తేటతెల్లమైంది. ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌కు ఏకంగా రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే స్వయంగా ఒప్పుకున్నారు. కరుడు గట్టిన ఉగ్రవాది, జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌(50) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్ర పిండాల వ్యాధితో అతడికి రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో ప్రతిరోజూ డయాలసిస్‌ జరుగుతోందని పాక్‌ అధికారులు వెల్లడించారు.

మసూద్‌ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతోపాటు తమకు టచ్‌లోనే ఉన్నాడనే విషయాన్ని కూడా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ శుక్రవారం స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ‘మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధాన సైనిక కార్యాలయం రావల్పిండిలోని సైనిక ఆస్పత్రిలో రోజూ ఆయనకు డయాలసిస్‌ జరుగుతోంది’అని అధికారులు తెలిపారు. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. పుల్వామా ఘటనకు బాధ్యుడైన మసూద్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మంత్రి.. ఆ ఆరోపణను జైషే మొహమ్మద్‌ సంస్థ కొట్టిపారేసిందంటూ బదులిచ్చారు.

అయితే, పుల్వా మా ఘటన వెనుక తామే ఉన్నామంటూ ఆ సంస్థ ప్రకటించింది కదా అని పేర్కొనగా ఆ సంస్థ పాత్ర ఉందనే విషయం గట్టిగా చెప్పలేమనీ, దానిపై కొన్ని అనుమానాలున్నాయన్నారు. అవిఏమిటనే ప్రశ్నకు మంత్రి ఖురేషి.. తమ ప్రభుత్వం జైషే నాయకులతో మాట్లాడగా వారు ఖండించారని వివరించారు. నిషేధిత సంస్థ నాయకులతో ఎవరు మాట్లాడారన్న ప్రశ్నకు ఆయన.. ‘ఇక్కడి ప్రజలు, వారిని గురించి తెలిసిన వారు’ అంటూ చెçప్పుకొచ్చారు. ఇలా ఉండగా, కరుడు గట్టిన ఉగ్రవాది జైషే మొహమ్మద్‌ అధినేత ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని అనారోగ్య స్థితికి చేరుకున్నారని పాక్‌ అధికారులు వెల్లడించారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శుక్రవారం మంత్రి ఖురేషి తెలిపిన విషయం తెలిసిందే.

జీహాద్‌ ప్రచారంలో దిట్ట
మజూద్‌ అజార్‌ నేతృత్వంలోని జైషే మహ్మద్‌ సంస్థ కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి యత్నించింది. 2016లో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంతోపాటు, ఉడిలోని సైనిక క్యాంపుపై దాడికి పాల్పడింది. కశ్మీర్‌లో బలగాలపై దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు బాలాకోట్, ఖైబర్‌ ఫక్తున్వాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపే ఆధారాలను భారత ప్రభుత్వం ఇటీవల పాక్‌కు అందజేసింది కూడా. ఈ సంస్థను అగ్ర దేశాలు నిషేధించాయి.

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు సన్నిహితుడైన మసూద్‌ను భారత్‌ కస్టడీ నుంచి విడిపించుకునేందుకు ఉగ్రవాదులు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని 1999లో కాందహార్‌కు దారి మళ్లించిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక అతడు జైషే మొహమ్మద్‌ను స్థాపించాడు. 1979–1989 సంవత్సరాల మధ్య అఫ్గానిస్తాన్‌లో తిష్టవేసిన సోవియెట్‌ రష్యా సేనలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో మసూద్‌ గాయపడ్డాడు.

అనంతరం కరడుగట్టిన చాందసవాదిగా మారిన అతడు ఉగ్ర సంస్థ హర్కతుల్‌ అన్సార్‌ కీలక నేతగా మారాడు. మంచి వక్త కూడా అయిన మసూద్‌ జీహాద్‌(పవిత్ర యుద్ధం)ను ప్రపంచవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమైన ఆత్మాహుతి దాడి కూడా తన సభ్యులేనంటూ ఈ సంస్థ ప్రకటించుకుంది. దీంతో అజార్‌ బావమరిది మౌలానా యూసఫ్‌ అజార్‌ నేతృత్వంలో నడుస్తున్న బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్‌ సంస్థ స్థావరంపై భారత వైమానిక దళం మెరుపుదాడులు చేపట్టి, తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి.

భారత్‌తో యుద్ధం ఆగదు..: జైషే
భారత్‌–పాక్‌ దేశాల మధ్య సంబంధాలకతీతంగా భారత్‌కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం (జీహాద్‌) కొనసాగుతుందని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ తీర్మానించిందని భారత నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2017 నవం బర్‌ 17న పాక్‌లోని ఒకారాలో జరిగిన సమావేశంలో జైషే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఆత్మాహుతి దాడి కుట్రదారుడు, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ సారథ్యం లో నిర్వహిస్తోన్న ఉగ్రవాద కార్యకలాపాల పట్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులు పొగడ్తల వర్షం కురిపించారని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

సరిహద్దుల్లో సేకరించిన సమాచారాన్ని బట్టి జైషే మహ్మద్‌ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ, ఘజ్వా–ఎ–హింద్‌ (భారత్‌పై ఆఖరి పోరాటం) సాగించాలని ఆ సమావేశాల్లో తీర్మానించింది. జైషే మహ్మద్‌ సంస్థ నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్, మహ్మద్‌ మసూద్, అబ్దుల్‌ మాలిక్‌ తాహీర్‌లు ఈ ఉగ్రవాద సమావేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా నిఘా సంస్థలు వెల్లడించాయి. 2018లో ఆరు రోజుల పాటు జైషే మహ్మద్‌ ‘షోబే తారఫ్‌’(డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఇంట్రడక్ష న్‌) 65 మంది ఉలేమా (మతగురువు)లతో సహా 700ల మంది ప్రతినిధులతో 13 సమావేశాలు నిర్వహించినట్టు నిఘావర్గాల నివేదికలు బయటపెట్టాయి.  

మత గురువుల హర్షం...: జైషే సంస్థ 2018, మార్చిలో షోబ–ఎ–తారిఫ్‌ ఉగ్రవాద సంస్థ ప్రతినిధులు సియాల్‌ కోట్‌ జిల్లాలో 4 రోజుల పాటు 1,500ల మందితో 17 సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వీటికి హాజరైన  50 మంది మతగురువులు సమావేశాల పట్ల హర్షంవ్యక్తం చేసినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు