కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!

12 Aug, 2019 04:09 IST|Sakshi

ఏడుగురు ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాలు

శ్రీనగర్‌: కశ్మీర్‌లో ఈద్‌ పండుగ సంబరాలపై లేదా స్వాతంత్య్ర దినోత్సవాలపై భారీ దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారనీ, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత ప్రభుత్వంపై నిందను మోపేందుకు మసీదుల్లో ప్రార్థనలపై ఈ దాడులు జరగొచ్చని తెలిపాయి. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూర్‌ అజార్‌ ఈ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. ఉగ్రవాద దాడి జరిపి వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాలంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) జైషే మహ్మద్‌కు సూచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం సరిగ్గా వారం క్రితం సంచలన, చారిత్రక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేస్తూ, కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా పాక్‌కు ముస్లిం దేశాలు సహా ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో, తాజాగా ఉగ్రవాద దాడికి దిగి, భారత్‌కు చెడ్డపేరు తీసుకురావాలని అనుకుంటోందని నిఘా వర్గాలు తెలిపాయి. బనిహల్, పిర్‌ పంజాల్‌ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనీ, రాజౌరీ లేదా పూంచ్‌ జిల్లాల్లోకి వాళ్లు చొరబడి ఉంటారని చెప్పాయి.

వ్యాపారులకు వెయ్యి కోట్ల నష్టం..
శ్రీనగర్‌లో ఆంక్షల కారణంగా వారం రోజుల్లో వ్యాపారులు రూ. వెయ్యి కోట్లు నష్టపోయుంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆంక్షల కారణంగా ప్రజలెవ్వరూ బటయకు రాకపోవడంతో రోజుకు రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని కశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సభ్యుడొకరు చెప్పారు.  పండుగ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లు ఆదివారం తెరిచే ఉన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా