ఆయుధాలు కావాలి.. సిద్ధంగా ఉండండి

10 Oct, 2016 11:33 IST|Sakshi
ఆయుధాలు కావాలి.. సిద్ధంగా ఉండండి

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. దాంతో ఏ క్షణంలో అడిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారుచేసి ఉంచుకోవాలని భారత ప్రభుత్వం ఆయుధాల సరఫరాదారులను కోరిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వివిధ ఆయుధ సరఫరాదారుల సామర్థ్యాన్ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవసరమైన పక్షంలో తాము చెప్పిన వెంటనే వాటిని సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలే కాకుండా.. అవసరమైతే అప్పటికప్పుడు సరఫరా చేసే ప్రాతిపదికన కొత్త ఒప్పందాలు కూడా చేసుకోవాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో చెబితే మనవాళ్లు ఎంత మొత్తంలో ఆయుధాలు సరఫరా చేయగలరన్న కచ్చితమైన సమాచారం తమకు కావాలని, అవసరాన్ని బట్టి ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఒకేసారి పెంచాలని కూడా కోరారంటున్నారు.

జనవరి నెలలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే ఆయుధాలు కావాలని చెప్పిందట. ప్రధానంగా చిన్న ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి, సుఖోయ్.. మిరేజ్ యుద్ధవిమానాల విడిభాగాలు కావాలని అప్పట్లో కోరినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29నాడు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ఒక్కరోజు ముందు కూడా అవసరమైతే భద్రతా కారణాల రీత్యా రక్షణ శాఖ బడ్జెట్‌ను పెంచాల్సి ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు.

అంతర్జాతీయ ఘటనల ప్రభావం మన మీద కూడా ఉంటుందని, అంఉదవల్ల అత్యవసరమైన పరిస్థితుల్లో జాతీయ వనరులను కూడా రక్షణ రంగానికి మళ్లించాల్సి ఉంటుందని, అది చాలా ప్రాధాన్యమైన అంశమని బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఒకవేళ భారీ యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మన సైన్యం వద్ద చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రికి తీవ్రమైన కొరత ఉంటుంది. అందుకే ముందుగా సిద్ధం కావడం మంచిదని రక్షణ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు