ప్రియాంకపై మాయావతి ఫైర్‌

9 Feb, 2020 15:57 IST|Sakshi

లక్నో : సామాజికవేత్త, కవి రవిదాస్‌ను అధికారంలో ఉండగా కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్నడూ గౌరవించలేదని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు. గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఆలయ సందర్శనలను మాయావతి ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.తాము అధికారంలో ఉన్న సమయంలో రవిదాస్‌కు తాము అత్యంత గౌరవం ఇచ్చామని మాయావతి చెప్పుకొచ్చారు. తమ పార్టీ యూపీలో అధికారంలోకి వస్తే బదోహి జిల్లాను తిరిగి సంత్‌ రవిదాస్‌ నగర్‌ జిల్లాగా మార్చుతామని స్పష్టం చేశారు.

ఎస్పీ ప్రభుత్వం గతంలో కుల కోణంలోనే రవిదాస్‌ నగర్‌ జిల్లా పేరును తొలగించిందని ఆమె మండిపడ్డారు. 1994లో వారణాసి జిల్లా నుంచి వేరుపరుస్తూ బీఎస్పీ హయాంలో సంత్‌ రవిదాస్‌ నగర్‌ జిల్లా ఏర్పడగా 2014లో అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం ఆ జిల్లా పేరును బదోహిగా మార్చింది. కాంగ్రెస్‌, బీజేపీ సహా ఇతర పార్టీలు అధికారంలో ఉండగా సంత్‌ గురు రవిదాస్‌ను పట్టించుకోకుండా, విపక్షంలో ఉన్నప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శిస్తున్నాయని మాయావతి ట్వీట్‌ చేశారు. గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వారణాసిలో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్న క్రమంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి : మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన

>
మరిన్ని వార్తలు