యోగి వ్యాఖ్యలపై బెహన్‌ మండిపాటు

21 Mar, 2019 16:39 IST|Sakshi

లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యూపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. యోగి సర్కార్‌పై బెహన్‌ మాయావతి గురువారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తాను యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోలేదని యోగి ఆదిత్యానాథ్‌ చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్‌ మాయావతి తోసిపుచ్చారు.

యోగి సీఎం అయిన తర్వాత యూపీలో పెద్దసంఖ్యలో మూకహత్యలు జరిగాయని గుర్తుచేశారు. యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రులు, ఆ పార్టీ నేతలు వారిపై గతంలో నమోదైన కేసులను రద్దు చేసుకోవడంలో మునిగిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. యూపీలో జరిగిన మూక హత్యలు, దాడులు దేశానికి చెడ్డపేరు తీసుకువచ్చాయని, న్యాయస్ధానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణలో యోగి సర్కార్‌ దారుణంగా విఫలమైందని, ఈ ప్రభుత్వం గో రక్షకులుగా చెప్పుకుంటున్న వారికి బాసటగా నిలిచిందని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు