మసూద్‌నూ వదలరా..?

2 May, 2019 13:32 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించిన నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాలు ఈ చర్యను స్వాగతిస్తుండగా, బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రచార అస్త్రంగా మలుచుకున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో బీజేపీ ప్రభుత్వం మసూద్‌ అజర్‌ను విడుదల చేసి అతిధి మర్యాదలతో విదేశాల్లో అప్పగించిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మసూద్‌ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాషాయపార్టీ తీరు తీవ్ర అభ్యంతరకరమని మాయావతి ఆక్షేపించారు.

కాగా, కాందహార్‌లో ఎయిర్‌ఇండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన క్రమంలో వారి డిమాండ్‌కు తలొగ్గిన అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం మసూద్‌ అజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మసూద్‌ అజర్‌ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా విపక్షాలు ఇటీవల విమర్శలు గుప్పించారు. అప్పటి అటల్‌ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి ఫలితంగానే పుల్వామా దాడి సహా జైషే మహ్మద్‌ ఉగ్ర మూకలు చెలరేగుతున్నాయని విపక్షాలు వ్యాఖ్యానించాయి.

మరిన్ని వార్తలు