ఆదర్శ జంట; సమయాన్ని దానం చేస్తున్నారు!

4 Oct, 2019 18:47 IST|Sakshi

ముంబై : డబ్బు దానం చేసే స్తోమత లేకపోతేనేం.. తమ విలువైన సమయాన్ని దానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ముంబైకి చెందిన ఓ జంట. తమ పనిమనిషి చేసే వంటకాలు అమ్మిపెడుతూ ఆమె కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ముంబైకి చెందిన అశ్వినీ షెనాయ్‌ షా, ఆమె భర్త ఎంబీఏ పట్టభద్రులు. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉన్నంతలో హాయిగా బతుకుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంట్లో పనిచేసే మహిళ కష్టాలు విని వీరు చలించిపోయారు. ఆమె భర్త పక్షవాతంతో బాధ పడుతున్నాడని తెలిసి.. ఆ కుటుంబానికి ఎలాగైనా అండగా నిలవాలనుకున్నారు. అయితే సదరు మహిళ ఆర్థిక సహాయం తీసుకోవడానికి తిరస్కరించడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. 

ఈ క్రమంలో ఆమెకు వంటలో ప్రావీణ్యం ఉందని తెలుసుకున్న షా దంపతులు.. తన కోసం ఓ చిన్న కొట్టును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే ఆమె చేసే వంటకాలు తీసుకుని కొట్టుకు వెళ్లి.. పది గంటల దాకా విక్రయిస్తారు. తద్వారా వచ్చిన సొమ్మును తమ పనిమనిషికి అందజేస్తారు. వీరి దయాగుణానికి సంబంధించిన విషయాలను దీపాళి భాటియా అనే నెటిజన్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

‘గాంధీ జయంతి రోజు నాకు బయట ఎక్కడా ఆహారం కనిపించలేదు. ఇంతలో ముంబైలోని కండీవాలీ స్టేషను బయట ఇద్దరు వ్యక్తులు టిఫిన్స్‌ అమ్మడం చూశాను. వారి దగ్గర పోహా, ఉప్మా, పరాటాలు, ఇడ్లీ ఉన్నాయి. ఎంతో రుచికరమైన ఆ వంటకాలను తింటుండగానే ఇలా వీధిలో ఎందుకు అమ్ముతున్నారు. మీరు చేసే టిఫిన్స్‌కు మంచి ఆదరణ వస్తుంది. హోటల్‌ పెట్టవచ్చు కదా అని సలహా ఇచ్చాను. అప్పుడు వాళ్లు చెప్పిన సమాధానం విని నా మనసు ఉప్పొంగిపోయింది. తమ పనిమనిషికి సాయం చేసేందుకు రోజుకు ఆరు గంటల పాటు ఇలా ఆహార పదార్ధాలు అమ్ముతారట. నిజంగా వీరిద్దరూ చాలా గొప్ప పనిచేస్తున్నారు’ కదా అని దీపాళి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. ‘మీ సేవాగుణానికి హ్యాట్సాఫ్‌.. మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారు. ఆదర్శ జంట’ అంటూ షా దంపతులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు