ఎంబీబీఎస్ ఫీజు.. రూ. 2 కోట్లు

26 Aug, 2016 11:51 IST|Sakshi
ఎంబీబీఎస్ ఫీజు.. రూ. 2 కోట్లు

తమిళనాడులో ఎంబీబీఎస్ చదవడానికి ప్రైవేటు కాలేజీలలో ఫీజు రెట్టింపు అయింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయనున్నారు. తమిళనాడులోని ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజులను పెంచాయి. ఈనెల 17వ తేదీన నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ ఫీజులు పెంచారు. ఇప్పుడు మంచి మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ చదవాలంటే రూ. 1.85 కోట్లు ఖర్చవుతుంది. అందులో కోటి రూపాయలు ట్యూషన్ ఫీజు కాగా, 85 లక్షలు కేపిటేషన్ ఫీజు. అన్ని కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలలో కేవలం ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థులు వేర్వేరు కాలేజీలకు దరఖాస్తు చేసుకోవచ్చు గానీ, నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలుంటాయి.

అయినా.. రూ. 40-85 లక్షల వరకు కేపిటేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కొన్ని కాలేజీలు తల్లిదండ్రులకు చెబుతున్నాయి. మెరిట్‌ను బట్టి ఫీజు ఉండాలి కదా అని తల్లిదండ్రులు ప్రశ్నించినా కాలేజీలు పట్టించుకోవడం లేదు. ఐదున్నరేళ్ల పాటు ఏడాదికి ఇంతింత ట్యూషన్ ఫీజు కట్టడం తమకు తలకు మించిన భారం అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

చెన్నైలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజిలో 2014లో ట్యూషన్ ఫీజు రూ. 9 లక్షలు ఉండేది. 2015లో అది 10 లక్షలైంది. ఈసారి మాత్రం 21 లక్షలు చేశారు. అందులో రూ. 2 లక్షలు డెవలప్‌మెంట్ ఫీజు, లక్ష కరిక్యులం ఫీజు అంటున్నారు. మొత్తమ్మీద ట్యూషన్ ఫీజుగానే కోటి రూపాయలు అవుతుందని, ఇతర ఖర్చులు మరో రూ. 25 లక్షలు ఉంటాయని సెల్వగణపతి అనే వ్యక్తి చెప్పారు. ఆయన కుమారుడికి నీట్‌లో 90 పర్సంటైల్ పైగా వచచింది. అయినా 0.25 కటాఫ్ పాయింట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల సీటు కోల్పోయాడు. అక్కడైతే ఏడాదికి రూ. 11,500 ట్యూషన్ ఫీజు కడితే సరిపోయేదని, తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ల కారణంగా తన కొడుక్కి సీటు రాలేదని ఆయన వాపోయారు.

మరిన్ని వార్తలు