మీడియా చేతికి ‘టాప్‌ సీక్రెట్‌’

6 Aug, 2019 03:33 IST|Sakshi
రహస్య పత్రాలను పార్లమెంట్‌కు తీసుకువస్తున్న అమిత్‌షా

అమిత్‌ షా చేతిలోని పత్రాలను ఫొటో తీసిన మీడియా

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

త్వరలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తారని జాబితాలో ప్రస్తావన  

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో చేపట్టింది. కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు చేరుకున్న అమిత్‌ షా, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా షా చేతిలో ‘టాప్‌ సీక్రెట్‌’పేరుతో ఉన్న పత్రాలు మీడియా కంటపడ్డాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను.. రాజ్యాంగపరమైన, రాజకీయం, శాంతిభద్రతలు అనే మూడు అంశాలుగా వర్గీకరించారు.

మొదటి విభాగంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్‌ షా నోట్‌ చేసుకున్నారు. సోమవారం కేబినెట్‌ సమావేశం నిర్వహించాక పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి కోవింద్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని అందులో ఉంది. అలాగే రాజ్యసభలో భద్రత విషయంలో ప్రధాని మోదీ సభ చైర్మన్‌ వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ఉంది. ఇక రాజకీయ విభాగంలో అఖిలపక్ష భేటీ నిర్వహణకు పిలుపునివ్వడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని ఎన్డీయే కూటమి ఎంపీలకు వివరించాలని అమిత్‌ షా నిర్ణయించారు. ప్రధాని మోదీ ఆగస్టు 7న జాతినుద్దేశించి ప్రసంగిస్తారని జాబితాలో ఉంది.

జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ మాలిక్‌తో పాటు యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడుతారని ఈ నోట్‌లో ఉంది. మరోవైపు శాంతిభద్రతల అంశానికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాను జమ్మూకశ్మీర్‌కు పంపాలని నిర్ణయించారు. యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, కేరళ, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా కల్పించేలా ఆయా ప్రభుత్వాలను ఆదేశించాలని జాబితాలో చేర్చారు.

>
మరిన్ని వార్తలు