ఇదంతా మీడియా సృష్టే

4 May, 2015 12:48 IST|Sakshi
ఇదంతా మీడియా సృష్టే

న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై విరుచుకు పడ్డారు. ఢిల్లీలో తమ పార్టీని నామ రూపాల్లేకుండా  చేసేందుకు మీడియా  సుపారీ తీసుకుందంటూ ఆయన  ఆరోపించారు.  పారదర్శకంగా వ్యవహరించాల్సిన మీడియాలోని ఒక సెక్షన్ తమ పార్టీపై తప్పుడు  ప్రచారం చేస్తోందంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

యాంటీ కరప్షన్ హెల్స్ లైన్ను  ఆదివారం ప్రారంభించిన  కేజ్రీవాల్ ఈ సందర్భంగా మీడియాపై తీక్షణమైన దాడి చేశారు.  మీడియాలోని ఒక వర్గం నిరాధారమైన వార్తలను ప్రసారం చేస్తూ తమ పార్టీ ప్రతిష్టను  దెబ్బతీస్తోందని ఆరోపించారు.   దీనిపై బహిరంగ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర రవాణాశాఖ మంత్రి  నితిన్ గడ్కరీ కి సంబంధించిన వార్తలను  టెలివిజన్ ఛానల్స్ ఎందుకు  చూపించడంలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.  తమ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.  వార్తా ప్రసారాల విషయంలో మీడియా  పారదర్శకంగా ఉండాలని సూచించారు.

తన మంత్రివర్గంలోని  న్యాయశాఖమంత్రి  తోమర్పై  వచ్చిన ఆరోపణలు కూడా మీడియా సృష్టేనన్నారు.  బీహార్ యూనివర్శిటీ నివేదికను కూడా ఆయన తప్పుబట్టారు. మంత్రి ప్రతిష్టకు కళంకం ఆపాదించేందుకే ఇదంతా జరిగిందని కేజ్రీవాల్ అన్నారు. తోమర్ న్యాయ పట్టా సక్రమమైందేనని ఆయన సమర్థించుకున్నారు.

మరిన్ని వార్తలు