జగ్జీత్‌ కిడ్నాప్‌: సిద్ధూ ఎక్కడికి పారిపోయారు?

4 Jan, 2020 20:46 IST|Sakshi

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుపై మీనాక్షీ లేఖి విమర్శలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో సిక్కులపై రాళ్ల దాడిని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని నంకానా గురుద్వారా సాహిబ్‌ వద్ద శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. సిక్కు యువతి జగ్జీత్‌కౌర్‌ను అపహరించి, మతమార్పిడికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయంపై స్పందించిన మీనాక్షి లేఖి.. కాంగ్రెస్‌ పార్టీ తీరును తప్పుబట్టారు.

‘ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా నవజ్యోత్‌ సింగ్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ను ఆలింగనం చేసుకుంటారా? ఈ విషయం గురించి కాంగ్రెస్‌ ఎందుకు స్పందించడం లేదు. సిద్ధు అన్నయ్య ఎక్కడికి పారిపోయారో తెలియడం లేదు’ అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా గతేడాది పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేసిన సమయంలో నవజ్యోత్‌ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశపు ఆర్మీ చీఫ్‌ను ఎలా కౌగిలించుకుంటారంటూ సిద్ధుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాయావతి
సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌ జన్మస్థానమైన నంకానా సాహిబ్‌ వద్ద సిక్కులపై రాళ్ల దాడిని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు...‘ గురునానక్‌ దేవ్‌ జీ జన్మస్థానం వద్ద శుక్రవారం జరిగిన మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ఘటనల గురించి మన దేశం సహజంగానే స్పందిస్తుంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని ట్విటర్‌ వేదికగా విఙ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు