రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

12 Apr, 2019 12:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ రఫేల్‌ తీర్పుపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును ఈనెల 15న విచారణకు చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై రివ్యూ పిటిషన్‌ పట్ల కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన మీదట కాపలాదారే దొంగ అని సుప్రీం కోర్టు పేర్కొందని రాహుల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరోవైపు కోర్టు ఉత్తర్వుల్లో కనీసం ఒక పేరా కూడా రాహుల్‌ చదవలేదని తాము భావిస్తున్నామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. తీర్పును పరిశీలించకుండానే రఫేల్‌ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నట్టు కోర్టు చెప్పినట్టుగా, కాపలాదారే దొంగ అని తీర్పు ఇచ్చినట్టు రాహుల్‌ మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

మై భీ చౌకీదార్‌ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో బీజేపీ చేపట్టిన క్యాంపెయిన్‌పైనా రాహుల్‌ భగ్గుమన్న సంగతి తెలిసిందే. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్‌ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు