మాంసం దుకాణాల కూల్చివేత

18 Sep, 2017 13:15 IST|Sakshi
దుకాణాలు కూల్చుతున్న పొక్లయినర్‌

40 దుకాణాలు నేలమట్టం
భారీగా పోలీసు బందోబస్తు
పంతం నెగ్గించుకున్న పురపాలక సంఘం అధికారులు


జయపురం : జయపురం పురపాలక సంఘం అధికారులు మాంసం దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించాలన్న తమ పట్టుదలను నెగ్గించుకున్నారు. పట్టణంలో మొదటి దైనిక బజారులో ఉన్న చేపలు, మాంసం దుకాణాలను ఈ నెల 15వ తేదీలోగా ఎత్తివేసి రెండవ దైనిక బజారుకు తరలించాలని పురపాలక సంఘం ఆదేశాలు జారీ చేసినా వ్యాపారులు స్పందించలేదు. దీంతో పురపాలక సంఘం అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వెంటనే దుకాణాలను తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొక్లయినర్లతో సహా మార్కెట్‌కు వచ్చి ఆయా దుకాణాలను కూల్చి నేలమట్టం చేశారు.

జయపురం పురపాలక సంఘం కార్యనిర్వాహక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న జయపురం సబ్‌ కలెక్టర్‌ చక్రవర్తి సింగ్‌ రాథోర్‌ పోలీసు బలగాలతో, మున్సిపాలిటీ సిబ్బందితో వచ్చి బిద్యాధర సింగ్‌ దవేవ్‌ దైనిక బజారులో మాంసాలు అమ్మకాల కోసం గతంలో ఏర్పాటు చేసిన దుకాణాలను పడగొట్టించారు. ఈ మార్కెట్‌లో మాంసం, చేపలు, ఎండు చేపలు అమ్మే దాదాపు 40 దుకాణాలను ఆదివారం నేలకూల్చారు. ఉదయం బోరున వర్షం పడుతున్నా దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్‌కు ఎవరూ అంతరాయం కలిగించకుండా మార్కెట్‌ ప్రవేశమార్గం వద్ద అధిక సంఖ్యలో పోలీసులు మోహరించి ఎవరినీ లోనికి వెళ్లనీయలేదు. కేవలం పత్రికల వారిని మాత్రం లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ రాథోర్‌ పోలీసు అధికారులతో చర్చించారు. ఈ ఆపరేషన్‌ను మున్సిపాలిటీ హెల్త్‌ ఆఫీసర్‌ అరుణకుమార్‌ పాఢీ, మున్సిపాలిటీ ఇంజినీర్, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా దుకాణాలు కూల్చే ఆపరేషన్‌ ముగిసింది.

రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే కష్టమే
పట్టణ నడిబొడ్డున ఉన్న బిద్యాదర్‌ దైనిక బజారులో అనేక దశాబ్దాలుగా ఉన్న మాంస దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించటంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ చర్య మంచిదే అయినా రెండవ దైనిక బజారుకు తరలించటంతో పట్టణంలోని దాదాపు 70 శాతం మంది ప్రజలకు మార్కెట్‌ దూరం అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంత దూరం వెళ్లాలి అంటే కష్టం అని అందుచేత పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు మాంసం చేపల దుకాణాలు ఏర్పాటు చేయాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

గాంధీ జంక్షన్, ప్రసాదరావుపేట, కెల్లానగర్, సాంబారు తోట, డెప్పిగుడ, కరణం వీధి, లేబర్‌ కాలనీ, పారాబెడ, నారాయణతోట వీధి, గైడ వీధి, మహారాణిపేట, భ««ధ్య వీధి, భూపతి వీధి, భోయివీధి, మిల్లు వీధి, జైలు రోడ్డు మొదలగు అనేక ప్రాంతాల నుంచి రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే ఆటోలపైనే వెళ్లాలని, ఇది ప్రజలకు వ్యయంతో కూడినది అని అంటున్నారు. అంతేకాకుండా రెండవ దైనిక బజారు రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతుందని అభిప్రాయ పడుతున్నారు. అందుచేత ప్రసాదరావుపేట, గాంధీ జంక్షన్, పారాబెడ, మొదలగు ప్రాంతాలలో మత్స్య మాంస దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు