ఒక్క కేసు లేదు, అయినా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి!

28 Mar, 2020 13:36 IST|Sakshi

షిల్లాంగ్‌:  అగ్రరాజ్యంతో సహా ప్రపంచదేశాలన్నిటిని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కేంద్ర చర్యలతో పాటు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్రాలు కూడా గట్టి చర్యలే తీసుకుంటున్నాయి. 

ఇందులో భాగంగానే మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా షిల్లాంగ్‌ విధుల్లోకి వచ్చి సామాజిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని, పోలీసులకు సహకరించి వారు గీత గీసిన ప్రదేశాల్లోనే నిలబడాలని విజ్ఞప్తి చేశారు. మీ మంచికోసమే ఇదంతా చేస్తున్నామని వారికి అర్థమయ్యేలా వివరించారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రజలు పాటించేలా చూడాలి అని కూడా సంగ్మా పోలీసులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మేఘాలయాలో ఒక్క కరోనా పాజిటివ్‌కేసు కూడా నమోదు కాలేదు. 

ఇది చదవండి: (కరోనా : డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక!)

ఇక ఇండియాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లోనే 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 873కి చేరింది. 21 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి ఇంకో 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కొవాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా భారత్‌ కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అనేకమంది వలస కూలీలు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ ఇళ్లను చేరుతున్నారు. 

మరిన్ని వార్తలు