‘ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కోవాల్సిన పనిలేదు’

25 Sep, 2019 14:44 IST|Sakshi

 ఐఏఎస్‌ రామ్‌సింగ్‌పై నెటిజన్ల ప్రశంసలు

షిల్లాంగ్‌ : పర్యావరణ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేయడమే కాకుండా...  ఆ బృహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామియై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రామ్‌సింగ్‌. మేఘాలయకు చెందిన ఐఏఎస్‌ అధికారి ఆయన. వెస్ట్‌కారో హిల్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రామ్‌సింగ్‌ ప్రకృతి ప్రేమికుడు. కాలుష్య రహిత, ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. సేంద్రీయ కూరగాయలు కొనడం కోసం వారాంతాల్లో ఏకంగా పది కిలోమీటర్లు నడిచి వెళ్తారు. తద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం... పనిలో పనిగా వ్యాయామం కూడా పూర్తవుతుందంటారు. వీపునకు వెదురుబుట్ట తగిలించుకుని.. భార్య, కూతురితో కలిసి మార్కెట్‌కు వెళ్లి రావడం మరో సరదా అని చెబుతారు రామ్‌ సింగ్‌‌. మేఘాలయ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్‌ సిటిజన్‌- వన్‌ ట్రీ’ కార్యాక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఈ బ్యూరోక్రాట్‌... తన లాగే మేఘాలయ యువత కూడా ప్లాస్టిక్‌కు నో చెప్పాలని పిలుపునిస్తున్నారు.(చదవండి : ఈ చెక్క బాటిల్‌ ఎంత బాగుందో!!)

ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే రామ్‌సింగ్‌ శుక్రవారం తన ‘మార్కెట్‌ యాత్ర’కు సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ‘ వారాంతాల్లో 21 కిలోల కూరగాయలు కొనడానికి 10 కిలోమీటర్లు నడిచి వెళ్తాను. నాకు ఇది మార్నింగ్‌ వాక్‌. ప్లాస్టిక్‌ లేదు. కాలుష్యం కూడా లేదు. అంతకుమించి ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కోవాల్సిన పనిలేదు. ఫిట్‌ ఇండియా. ఫిట్‌ మేఘాలయ. సేంద్రీయ పదార్థాలు తినండి. తుర పట్టణాన్ని పచ్చగా.. పరిశుభ్రంగా ఉంచండి’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రామ్‌ సింగ్‌ జీవన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇండియన్‌ బ్యూరోక్రసీలో ఓ కొత్త అధ్యాయం. మీరు నిజంగా ఆదర్శనీయం సార్‌. మీ స్పూర్తితో మేము కూడా ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం. వాకింగ్‌ చేసి ఆరోగ్యాన్ని సైతం కాపాడుకుంటాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ సింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ విషయం గురించి రామ్‌సింగ్‌ మాట్లాడుతూ...‘ కూరగాయల కోసం దూరం వెళ్లాల్సి వస్తోంది... వాటిని మోసుకురావడం మరో ఎత్తు అంటూ ఎంతో మంది నా దగ్గర వాపోయారు. అలాంటప్పుడు కొకెంగ్‌(వెదురు బుట్ట) తీసుకువెళ్లవచ్చు కదా అని సలహా ఇచ్చాను. తద్వారా ప్లాస్టిక్‌ వాడకం కూడా తగ్గిపోతుంది కదా అని చెప్పాను. కానీ వారికి నా మాటలు నవ్వు తెప్పించాయి. అందుకే ఆచరించి చూపితే వారిలో మార్పు వస్తుందని భావించాను. గత ఆర్నెళ్లుగా నా భార్యతో కలిసి సరదాగా మార్కెట్‌కు నడిచి వెళ్తూ కొకెంగ్‌లో వారానికి సరిపడా సేంద్రీయ కూరగాయలు తెచ్చుకుంటున్నా. ఆధునిక యుగంలో ఎదురయ్యే సరికొత్త సవాళ్లకు సంప్రదాయ పద్ధతిలో పరిష్కారాలు కనుగొని వాటిని అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా