సంచలనం సృష్టిస్తోన్న మాజీ సీఎం కూతురి వాయిస్‌ మెసేజ్‌

16 Aug, 2019 10:19 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాని అరెస్ట్‌ చేసి ఇప్పటికి పది రోజులకు పైనే అయ్యింది. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో వీరిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓ వాయిస్‌ మెసేజ్‌ని విడుదల చేశారు. మీడియాతో మాట్లాడితే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై అమిత్‌ షా వివరణ ఏంటని ఇల్తిజా ప్రశ్నించారు.

‘ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. కశ్మీర్‌ ప్రజలని మాత్రం జంతువుల మాదిరి ఓ బోనులో బంధించారు. వారు మానవ హక్కులను కూడా కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన వ్యక్తం చేయకుండా ఉండటం కోసం మా రాష్ట్రంలో సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. బయటి ప్రపంచంతో మా సంబంధాలను నిలిపివేసి మా గొంతు నొక్కేశారు’ అన్నారు.

‘అంతేకాక నన్ను కూడా నిర్భందించారు. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీడియాకు తెలియజేశాను. అందుకే నన్ను కూడా నిర్భందించారు. ఈ విషయాల గురించి మరోసారి మీడియాతో మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం నన్ను నిఘా పర్యవేక్షణలో ఉంచి నేరస్తురాలిగా చూస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను కూడా చంపేస్తారేమోనని భయంగా ఉంది. నా మాటలపై అమిత్‌ షా ఎలా స్పందిస్తారో చూడాలి’ అంటూ ఇల్తిజా వాయిస్‌ మెసేజ్‌ను రిలీజ్‌ చేశారు.

ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, మానవహక్కుల ఉల్లంఘన జరగుతుందంటూ.. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇల్తిజా సందేశం సంచలనం సృష్టిస్తోంది.

మరిన్ని వార్తలు