సంచలన వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ

23 Jul, 2019 17:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రతిపక్షాలన్ని ఈ విషయంలో మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. భారత్‌, పాక్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఫ్తీ కోరారు.

ఈ సందర్భంగా ముఫ్తీ.. ‘జమ్మూకశ్మీర్‌ అంశంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ అంగీకరించదని తెలుసు. అయితే ట్రంప్‌ చేసిన ప్రకటన భారీ మార్పులను సూచిస్తోంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో అమెరికాకు గొప్ప రికార్డేం లేదు. కానీ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను రెండు దేశాలు సీరియస్‌గా తీసుకుంటే బాగుంటుంది. చర్చల ద్వారా శాంతి స్థాపనకు ఇది మంచి అవకాశం. ఇరు దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది’ అంటూ ముఫ్తీ ట్వీట్‌ చేశారు.
 

కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్విటర్‌ వేదికగా ట్రంప్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్‌ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు